సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'ఒక్కడు' సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ కు ఒక మాస్ స్టార్ డమ్ వచ్చేసింది. ఈ సినిమా 2003లో విడుదలై ఆ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజా ఇంటర్వ్యూలో ఆ చిత్ర నిర్మాత ఎం.ఎస్.రాజు ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కొన్ని రూమర్స్‌పై కూడా స్పందించారు. 


పౌర్ణమి సినిమా తర్వాత ఆయన సినిమా నిర్మాణాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన తీసిన  ప్రతీ సినిమాలోనూ ఆయన మానిటరింగ్ ఉండేదని, అయితే ఒక్కడు సినిమాలో అది జరగలేదని చెప్పారు. ఎందుకు అని అడిగితే.. గుణశేఖర్ ఒక్కడు సినిమా కథ చెప్పినప్పటి నుంచే ఆయనకే పూర్తి బాధ్యతలు వదిలేశానని చెప్పారు ఎం.ఎస్.రాజు. ఆ కథ మీద గుణశేఖర్ కు ఉన్న గ్రిప్ వలన తాను కలుగజేసుకోలేదని చెప్పారు. అయితే ముందు కథ గురించి మాట్లాడినప్పుడు కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయని, అవి అందరి సినిమాలోనూ జరుగుతాయని అన్నారు. ఆ సినిమాలో ఖర్చుకు ఎక్కడా తగ్గలేదని, డైరెక్టర్ అడిగినట్లే భారీ సెట్స్ కూడా వేశామని చెప్పారు. 


అయితే ఆ సినిమా తర్వాత గుణశేఖర్, మహేష్ ల కలయికలో సినిమా చేసే అవకాశం రాలేదని చెప్పారు. అంతేగాని ఒక్కడు సినిమాతో తమ మధ్య వివాదం ఏమి లేదని స్పష్టం చేశారు. ఒక్కడు షూటింగ్ సమయంలోనే హీరో ప్రభాస్ తండ్రి తనను కలవాలని చెప్పారని, అప్పుడే ప్రభాస్ తో సినిమా చేస్తానని హామీ ఇచ్చానని పేర్కొన్నారు. ఒక్కడు భారీ హిట్ తో ప్రభాస్ తో సినిమా ఓకే చేయగానే ఆయన ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేశారని పేర్కొన్నారు.


ఆ తర్వాత ప్రభాస్ తో తీసిన సినిమానే 'వర్షం' అని పేర్కొన్నారు. వర్షం సినిమా కూడా భారీ హిట్ అయిందని తెలిపారు. తాను వర్షం తర్వాత కథ పరంగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాకు హీరో సిద్దార్దను ఎంపిక చేశానని చెప్పుకొచ్చారు. ‘‘సిద్దార్థ్ హీరో అంటే చాలా మంది విమర్శించారని, అమ్మాయిలా ఉన్నాడు వీడు హీరో ఏంటి’’ అని సిద్ధార్థ గురించి తనతో అన్నారని, అయినా అవన్నీ పట్టించుకోకుండా సినిమా తీసి హిట్ కొట్టానని అన్నారు.


ఆ సినిమాకు దర్శకుడుగా ప్రభుదేవా ను పరిచయం చేస్తే అప్పుడు కూడా విమర్శలు చేశారని గుర్తు చేసుకున్నారు. పౌర్ణమి సినిమా తర్వాత చాలా మంది మధ్యలో తన వద్దకు వచ్చారని చెప్పారు. మహేష్, ప్రభాస్, రవితేజ, త్రివిక్రమ్ లాంటి వారు వచ్చి సినిమా చేయాలని అడిగినా తాను నో చెప్పానని అన్నారు. తనకు నచ్చిన కథనే చేస్తానని, వేరే కథలు చేయను అని అప్పుడే ఫిక్స్ అయ్యానని పేర్కొన్నారు.


అయితే ఎవరెన్ని విమర్శలు చేసినా తాను పట్టించుకులేదన్నారు. హీరో స్టార్ డమ్ ను పట్టించుకోనని కథ పరంగానే తాను ముందుకెళ్తానని అన్నారు. తాను పరిచయం చేసిన వారంతా ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు. తాను మాత్రం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడ ఉన్నానా అని అనిపిస్తుందని, ఎప్పటికైనా మళ్ళీ టాప్ పొజిషన్ లోకి వెళ్తానని చెప్పారు ఎం.ఎస్.రాజు.


Also Read: మీ ఇంటికే వచ్చేస్తున్న ‘ఘోస్ట్’ - ఓటీటీలో రిలీజ్, మరీ ఇంత త్వరగానా?