Mallikarjun Kharge:


AICC కార్యాలయంలో బాధ్యతలు..


మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికారికంగా ఇవాళ బాధ్యతలు తీసుకోనున్నారు. AICC హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన బాధ్యతలు చేపట్టను న్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులతో పాటు ఎంపీలు, మాజీ ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వేణుగోపాల్ ఇప్పటికే అందరికీ ఆహ్వానం అందించారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ కూడా హాజరు కానున్నారు. అక్టోబర్ 17న కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక జరగ్గా...ప్రత్యర్థి శశిథరూర్‌పై ఘన విజయం సాధించారు మల్లికార్జున్ ఖర్గే. "మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి నాకు ఆహ్వానం అందింది. అందుకే ఢిల్లీ వెళ్తున్నాను" అని భాగేల్ వెల్లడించారు. ఎన్నికల్లో ఎక్కువ మంది కాంగ్రెస్‌ శ్రేణులు ఖర్గేకు ఓటు వేశారు. పార్టీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్‌ పోటీ పడ్డారు. అక్టోబర్ 19న ఫలితాలు వెలువడ్డాయి. దీంతో 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టననున్నారు. జరిగిన ఎన్నికల్లో ఖర్గేకు అనుకూలంగా చాలా మంది తమ ఓటు వేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌లో జరిగిన ఎన్నికల్లో 7897 మంది ఖర్గేకు అనుకూలంగా ఓట్లు వేశారు. 1072 మంది శశిథరూర్‌కు అనుకూలంగా ఓటు వేశారు. అంటే 6800పైగా మెజారిటీతో  ఖర్గే విజయం సాధించారు. 416 ఓట్లు చెల్లకుండా పోయాయి. 


థరూర్ వర్సెస్ ఖర్గే


కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడ్డారు. వీరి మధ్య గట్టిగానే పోటీ నెలకొంది. ఎక్కువ మంది మాత్రం ఖర్గే వైపే మొగ్గు చూపతూ తీర్మానాలు కూడా చేశారు. చాలా రాష్ట్రాల్లో ఆయనకు అనుకూలంగా ప్రచారం చేశారు. తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ లీడర్లు ఖర్గేకు ఓటు వేశారు. ఆయన ప్రత్యక్షంగా వచ్చి అందర్నీ కలిసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తరవాత ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. "ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేసేందుకే ప్రయత్నించింది" అని స్పష్టం చేశారు. అదే సమయంలో తన ప్రత్యర్థి శశిథరూర్‌పై ప్రశంసలు కురిపించారు. పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారని చెప్పారు. అటు థరూర్ కూడా ఖర్గే ఇంటికి వెళ్లి మరీ అభినందించారు. 


మూడు సవాళ్లు..


అధ్యక్షుడిగా ఎన్నికవటంతోనే సరిపోలేదు. 125 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఉనికి కాపాడేందుకు ఖర్గే చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఆయన ముందు మూడు సవాళ్లు ఎదురవనున్నాయి. మొదటిది...రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని సద్దుమణిగేలా చేయడం. అశోక్ గహ్లోట్‌, సచిన్‌ పైలట్‌ మధ్య ఉన్న వైరాన్ని తగ్గించటమా..? లేదంటే వాళ్లలో ఎవరో ఒకరిని రాష్ట్రానికి సీఎంగా ప్రకటించటమా అన్నది తేల్చుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా...హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు మరో రెండు సవాళ్లు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బలం పుంజుకోవడం కాంగ్రెస్‌కు చాలా కీలకం. మరి..ఈ సవాళ్లను ఖర్గే ఎలా ఎదుర్కొంటారో చూడాలి. 


Also Read: Munugode Bypolls: మునుగోడులో పోటాపోటీగా టీఆర్ఎస్, బీజేపీ సభలు - ఈ 30న కేసీఆర్, 31న నడ్డా మీటింగ్