Dry Shampoo: ఒక ప్రముఖ కాస్మోటిక్ సంస్థ తాము తయారు చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టిన డ్రై షాంపూలను మళ్లీ వెనక్కి తీసుకుంది. ఎందుకంటే వాటిలో అధిక స్థాయిలో మన చర్మానికి, ఆరోగ్యానికి హానిచేసే రసాయనాలు ఉన్నట్టు తేలింది. ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు రాకపోయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఆ సంస్థ డ్రై షాంపూను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. అమెరికా, కెనడాలలో అధికంగా ఈ షాంపూలను వెనక్కి తీసుకున్నారు. అసలేంటీ డ్రై షాంపూ? దీని వల్ల ఎలాంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.
ఏంటి డ్రై షాంపూ?
ఇది అత్యాధునిక షాంపూ. ఇది పొడి లేదా స్ప్రే రూపంలో ఉంటుంది. జుట్టు తడి చేయకుండానే దీన్ని జుట్టుకు రాసుకోవచ్చు.జుట్టుపై ఉన్న నూనె, జిడ్డులను ఇది తొలగించి సిల్కీగా మారుతుంది. ఈ షాంపూలను ఆల్కాహాల్ లేదా స్టార్చ్ ఆధారిత పదార్థాలతో చేస్తారు. అలాగే కొన్ని రసాయనాలు కూడా కలుపుతారు. దీన్ని వాడడం చాలా సులువు కాబట్టి ప్రత్యేకంగా తెప్పించుకుని మరీ అబ్బాయిలు, అమ్మాయిలు వాడేస్తున్నారు. అందుకే వీటి అమ్మకాలు కొన్ని దేశాల్లో అధికంగా ఉన్నాయి.
బెంజీన్ స్థాయిలు పెరిగితే...
ఈ డ్రై షాంపూ తయారీలో బెంజీన్ రసాయనాన్ని కూడా వాడతారు. బెంజీన్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాంటి దాన్ని షాంపూలో అధికంగా కలపడం వల్ల ప్రతి రెండు రోజుకోసారి ఈ షాంపూను వాడే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది. బెంజీన్ పీల్చడం వల్ల, చర్మానికి తాకడం వల్ల, నోటి ద్వారా శరీరంలోకి చేరినా కూడా లుకేమియా వంటి బ్లడ్ క్యాన్సర్‌తో పాటూ, బోన్‌మారో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ డ్రై షాంపూలను వెనక్కి తీసుకున్నారు.
షాంపూలలో ఉండే బెంజీన్ కేవలం వాడిన వారికే కాదు, బెంజీన్ వాతావరణంలో కలిసి పక్కనున్న వారికి ఇబ్బందులను కలుగ చేస్తుంది. అందుకే మీరు షాంపూ తీసుకున్నప్పుడు అందులో బెంజీన్ వాడారో లేదో చదివి తీసుకోవడం బెటర్. ప్రతి షాంపూ మీద అందులో వాడిన రసాయనాలు పేర్లు రాసి ఉంటాయి. అందులో బెంజీన్ ఎక్కువ శాతంలో ఉన్నట్టు తెలిస్తే మాత్రం దాన్ని కొనుక్కోకపోవడమే మంచిది.
Also read: ఇండియా - పాక్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్న వ్యక్తికి గుండెపోటు, అత్యుత్సాహం వల్ల గుండె ఆగుతుందా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.