దీపావళి రోజున ఆ ఊళ్లో నెత్తురు పారింది. అతి కిరాతకమైన హత్య ఉదంతంతో ఊరు ఊరంతా నిద్ర లేచింది. సొంత అన్న తన తమ్ముడ్ని గొడ్డలితో విచక్షణారహితంగా నరికి చంపడం అక్కడ తీవ్ర సంచలనంగా మారింది. అందుకు కారణం అనుమానం అని స్థానికులు తెలిపారు. తన భార్యతో సన్నిహితంగా ఉన్నాడనే కారణంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.


సోమవారం (అక్టోబరు 24) తెల్లవారుజామున ఏం జరిగిందని స్థానికులు తెలుసుకునే లోపే.. ఆ హత్య తానే చేశానంటూ నిందితుడు అందరి ముందూ ధైర్యంగా చెప్పాడు. తన భార్యతో సన్నిహితంగా ఉండటం తన కళ్లారా చూశానని చెప్పాడు. 


స్థానికులు, పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం పూర్తి వివరాలు ఇవీ.. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన సాదం రామకృష్ణ, సాదం నరేశ్‌(32) అన్నదమ్ములు. నరేశ్‌ అదే ఊళ్లో వాటర్‌ ప్లాంట్‌లో పని చేస్తున్నాడు. రామకృష్ణ వేరే చోట్ల వేర్వేరు పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. వీరిద్దరూ ఒకే ప్రాంగణంలో వేరే వేరే గదుల్లో నివాసం ఉంటుంటారు. నరేశ్‌ భార్య రెండేళ్ల క్రితం గొడవలతో పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తన తల్లి సుబ్బమ్మతో కలిసి అతను ఉంటున్నాడు. 


రామకృష్ణ తన భార్య, ఇద్దరు కుమారులతో మరో గదిలో ఉంటున్నాడు. ఇతను 15 రోజుల క్రితం ఇంటికి వచ్చేసరికి తన భార్య, తమ్ముడు నరేశ్‌ సన్నిహితంగా ఉండటాన్ని గమనించాడు. అప్పటి నుంచి భార్యను మరింత తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడు. భయపడిన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. తనపై కోపం పెంచుకోవడంతో తమ్ముడు అప్పటి నుంచి భయంగా ఉంటున్నాడు. 


పుట్టింటికి వెళ్లిన తన భార్యను పిలిపించాలని రామకృష్ణ ఇటీవల పోలీసులను కలిశాడు. వారు ఫోన్ చేయగా, ఆమె మళ్లీ రానని తెగేసి చెప్పింది. దీంతో తమ్ముడిపై మరింత అక్కసు పెంచుకున్నాడు. మచ్చిక చేసుకున్నట్లుగా నటించి ఈ నెల 23(ఆదివారం) రాత్రి ఇద్దరూ మద్యం తాగి ఇంటికి వెళ్లారు. ఒకే గదిలో వేర్వేరు మంచాలపై పడుకున్నారు.


గొడ్డలితో నరికి హత్య
రామకృష్ణ సోమవారం ఉదయాన్నే నిద్రలేచాడు. నిద్రిస్తున్న తమ్ముడిని ‘తమ్ముడూ లేరా.. లేరా’ అంటూ పిలిచి గొడ్డలితో తల, మెడ, నుదురుపై ఎనిమిది సార్లు విచక్షణారహితంగా వేట్లు వేశాడు. మృతి చెందాక తన సెల్‌లో ఫొటోలు తీసి బంధువులకు పంపాడు. ఊరు బయట అందరి మధ్యలో తమ్ముణ్ని తానే చంపానని, నిద్రపోతున్న వాడిని చంపొద్దనే భావనతో వాడిని నిద్ర లేపుతూనే వేట్లు వేశానని స్పష్టం చేశాడు. విషయాన్ని గ్రామ సర్పంచికి కూడా తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు.


సాదం రామకృష్ణ చిన్నప్పటి నుంచి కటువు స్వభావంగా ఉండేవాడని స్థానికులు తెలిపారు. నరేశ్‌ భార్యను కూడా ఇతను హింసించేవాడని దీంతో ఆమె రెండేళ్ల క్రితం వెళ్లిపోయిందని పోలీసులకు తెలిపారు. తన మొదటి భార్యను కూడా వేధించటంతో ఆమె వెళ్లిపోయిందని, రెండో పెళ్లి కూడా చేసుకున్నాడని చెప్పారు. ఓ గుడిలో విగ్రహాల దొంగతనం కేసులో రామకృష్ణ ప్రధాన నిందితుడిగా కూడా ఉన్నాడు.