యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. మారుతి (Maruthi) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే. దాని కోసం సోమవారం షూట్ చేశారు. అయితే... అది రెగ్యులర్ షూటింగ్ కాదు. లుక్ టెస్ట్ కోసం చేసిన ఫోటో షూట్! 


Prabhas Birthday Special : మారుతి లుక్ టెస్ట్ చేసింది ప్రభాస్ అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వడం కోసం. ఈ ఆదివారం (అక్టోబర్ 23న) ప్రభాస్ పుట్టిన రోజు. ఆ రోజు మూవీని అధికారికంగా ప్రకటించనున్నారు. దాని కోసమే ఫోటో షూట్ చేశారట. లుక్ టెస్ట్ వెనుక కహాని అది! అసలు మేటర్ ఏంటంటే... ఈ సినిమాలో ప్రభాస్ లుక్, డ్రసింగ్ స్టైల్ చాలా కొత్తగా ఉంటాయట. 


Prabhas - Maruti film update : లుక్ టెస్ట్ చేశారు సరే... మరి, రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అంటే... బుధవారం! హైదరాబాద్ సిటీలోని ఒక ప్రముఖ  స్టూడియోలో ఈ సినిమా కోసం స్పెషల్ సెట్ వేశారు. అందులో షూటింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ షెడ్యూల్ వారం రోజులు ఉంటుందని తెలుస్తోంది. అందులో ప్రభాస్ సహా హీరోయిన్లు కూడా జాయిన్ అవుతారని సమాచారం. 


మూడో కథానాయిక ఎవరో?
ప్రభాస్, మారుతి సినిమాలో నిధి అగర్వాల్ (Nidhi Agarwal), మాళవికా మోహనన్ (Malavika Mohanan) ను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. ఇందులో మొత్తం ముగ్గురు హీరోయిన్లకు చోటు ఉంది. మూడో కథానాయికను త్వరలో ఎంపిక చేయనున్నారు. తొలుత 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీ లీల, మెహరీన్ కౌర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు వినిపించాయి. ఇప్పుడు శ్రీ లీల పేరు డ్రాప్ అయినట్లు టాక్. మారుతి దర్శకత్వం వహించిన 'మంచి రోజులు వచ్చాయి'లో నటించిన మెహరీన్‌కు ప్రభాస్ సరసన నటించే అవకాశం వస్తుందో? లేదో? వెయిట్ అండ్ సీ!  


హారర్ కామెడీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని మారుతి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'రాజు డీలక్స్' టైటిల్ ఖరారు చేసినట్టు టాక్. ఆ విషయం కూడా ఆదివారం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


Also Read : రామ్ 'చరణ్ - అర్జున్' అల్లు సినిమాకు నిర్మాత రెడీ


మారుతి సినిమా కాకుండా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ సినిమాలు ఉన్నాయి. అందులో 'ఆదిపురుష్' సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఆ సినిమా నుంచి బర్త్ డే గిఫ్ట్ కింద ఒక పోస్టర్ లేదంటే ట్రైలర్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న 'సలార్' షూటింగ్ జరుగుతోంది. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇవి పూర్తి అయిన తర్వాత 'స్పిరిట్' సెట్స్ మీదకు వెళుతుంది.