ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కలిసి ఓ సినిమా చేస్తే? ఈ ఊహ ఎంత బావుందో కదూ! దానిని ఊహ అనడం కంటే ఓ అగ్ర నిర్మాత బలమైన కోరికగా చెప్పడం సబబు! ఎప్పటికి అయినా సరే నిజం అవుతుందని అనడం కరెక్ట్! ఎందుకంటే... ఆయన తలుచుకుంటే చరణ్, అర్జున్‌తో సినిమా చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు. ఆల్రెడీ టైటిల్ ఫిక్స్ చేశారు. సినిమా తీయడానికి తాను సిద్ధమని ప్రకటించారు. ఆయన ఎవరు? అసలు కథ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... 


Allu Aravind On Allu Arjun Ram Charan Multi Starrer Movie : అల్లు అర్జున్, రామ్ చరణ్ హీరోలుగా మల్టీస్టారర్ సినిమా నిర్మించాలని ఉందని చెప్పిన అగ్ర నిర్మాత ఎవరో కాదు... మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో  ఆయన ఈ విషయం వెల్లడించారు. 


'భవిష్యత్తులో గీతా ఆర్ట్స్ సంస్థలో ఎటువంటి సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు?' అని ఆలీ అడగ్గా... ''ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో గానీ, నా కోరిక ఒకటి ఉంది. గీతా ఆర్ట్స్ లో బన్నీ, చరణ్ కలిసి పని చేస్తే బావుంటుంది. నేను పదేళ్ల క్రితం ఒక టైటిల్ రిజిస్టర్ చేశా. 'చరణ్ - అర్జున్' (Charan Arjun Telugu Movie) అని. ఆ టైటిల్ ఇప్పటి వరకు రెన్యూవల్ చేస్తూ వస్తున్నాను. ఎప్పటికి అయినా సరే ఆ సినిమా జరుగుతుందని ఆశ'' అని అల్లు అరవింద్ సమాధానం చెప్పారు. ఇప్పటి వరకూ ఆ సినిమా కోసం కథలు వినడం ప్రారంభించలేదని మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. టైటిల్ ఉంది కాబట్టి... భవిష్యత్తులో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 


'ఎవడు' సినిమాలో రామ్ చరణ్, అల్లు అర్జున్ నటించారు. అయితే, ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేములో ఉండరు. అందులో అల్లు అర్జున్ స్క్రీన్ మీద కనిపించేది చాలా తక్కువ సమయమే. అందుకని, ఆ సినిమాను పూర్తిస్థాయి మల్టీస్టారర్ అని చెప్పలేం! ఇప్పుడు అల్లు అరవింద్ చెప్పిన దాని ప్రకారం... వీళ్ళిద్దరి మల్టీస్టారర్ కన్ఫర్మ్. 


Also Read : మా నాన్నలో ఆ విషయమే నాకు అస్సలు నచ్చదు: మంచు విష్ణు - ఆ మాటకు షాకయ్య: మోహన్ బాబు


'ఎవడు' సినిమా సమయంలో రామ్ చరణ్ ఇమేజ్ వేరు. అల్లు అర్జున్ స్టార్ డమ్ వేరు. ఇప్పుడు వాళ్ళిద్దరి ఇమేజ్ వేరు. ప్రస్తుతం ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. 'పుష్ప 2' షూటింగ్ చేయడం కోసం అల్లు అర్జున్ రెడీ అవుతున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ రెండూ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో వీళ్ళిద్దరూ చేసే సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుందని మరో సందేహం లేకుండా చెప్పవచ్చు. 


ఇప్పుడు తెలుగు సినిమాలకు, తెలుగు హీరోలు నటించే సినిమాలకు హిందీ ప్రేక్షకుల నుంచి ఆదరణ, బాలీవుడ్ మార్కెట్ సూపర్బ్ అని చెప్పాలి. 'ఆర్ఆర్ఆర్' సినిమాకు హిందీలో ఎన్ని వసూళ్లు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించారు. భవిష్యత్తులో రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమా చేస్తే... 'ఆర్ఆర్ఆర్' స్థాయిలో ఉంటుందని, అంచనాలు కూడా అలాగే ఉంటాయని ఆశించవచ్చు.