టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు ఇంగ్లండ్ చుక్కలు చూపించింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో చెలరేగి ఆడి విజయాన్ని సాధించింది. 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ ఒక దశలో 66 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా తర్వాత కేవలం 6.4 ఓవర్లలోనే 97 పరుగులు సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.


మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఓపెనర్ మసూద్, ఆఖర్లో మహ్మద్ వసీం జూనియర్ మినహా ఎవరూ వేగంగా ఆడలేదు. దీనికి తోడు ఇంగ్లండ్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో పాకిస్తాన్ 19 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. 


అనంతరం ఇంగ్లండ్ మొదట్లోనే కష్టాల్లో పడింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, అలెక్స్ హేల్స్ ఘోరంగా విఫలం అయ్యారు. వన్‌డౌన్‌తో వచ్చిన బెన్ స్టోక్స్ వేగంగా ఆడినా త్వరగానే పెవిలియన్ బాట పట్టాడు. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 66 పరుగులు మాత్రమే చేసింది.


అయితే అసలు ఆట అప్పుడే మొదలైంది. లియాం లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, శామ్ కరన్ చెలరేగి ఆడటంతో ఇంగ్లండ్ 14.4 ఓవర్లలోనే నాలుగు వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఎనిమిది ఓవర్ల తర్వాత కేవలం 6.4 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.


తొమ్మిది ఓవర్లో 20 పరుగులు, 10వ ఓవర్లో 11 పరుగులు, 11వ ఓవర్లో 8 పరుగులు, 12వ ఓవర్లో 15 పరుగులు, 13వ ఓవర్లో 15 పరుగులు, 14వ ఓవర్లో 22 పరుగులను ఇంగ్లండ్ బ్యాటర్లు సాధించారు. ఈ విజయంతో ప్రపంచకప్‌లో మిగతా జట్లకు ప్రమాద హెచ్చరికలు పంపారు.