క్రికెట్ అభిమానులందరి కళ్లు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మీదనే ఉన్నాయి. ప్రస్తుతం క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతుండగా, ఆదివారం జరగనున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ నుంచి అసలైన యాక్షన్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు టోర్నమెంట్‌లోని ఫేవరెట్‌ల్లో ఒకటి. అయినా ఈ ఈవెంట్‌కు ముందు గాయం సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇద్దరూ గాయపడ్డారు. దీంతో కీలకమైన వీరిద్దరూ లేకుండానే భారత్ టోర్నీ ఆడనుంది.
ఇతర ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉన్నప్పటికీ వీరు లేని లోటు స్పష్టంగా తెలియనుంది. ఈ నేపథ్యంలో 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు సభ్యుడు సురేష్ రైనా 'మెన్ ఇన్ బ్లూ' కోసం 'గేమ్‌ని కంట్రోల్ చేసే' ఆటగాడిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కానీ అది విరాట్ కోహ్లీనో, రోహిత్ శర్మనో కాదు. పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.
"సూర్యకుమార్ యాదవ్ గత రెండేళ్లలో చేసిన బ్యాటింగ్ అద్భుతం. అతను అదే ప్రదర్శన కనపరచాలని నేను కోరుకుంటున్నాను. టీమిండియాలో ఇంకో డార్క్ హార్స్ ఉంది. అతని యాంగిల్, స్వింగ్ అద్భుతమైనది. కానీ నాకు తెలిసి ఈ టోర్నీలో టీమిండియాకు అత్యంత కీలకమైన ఆటగాడు హార్దిక్ పాండ్యా. అతను ఆటను తన కంట్రోల్‌లోకి తీసుకోగలడు. కీలకమైన ఓవర్లు బౌల్ చేస్తాడు. మహేంద్ర సింగ్ ధోని తరహాలో మ్యాచ్‌లు ముగించగలడు. ఈ ఆటగాళ్లు ఎంతో కీలకమైన వారు. అయితే అదే సమయంలో అర్ష్‌దీప్ సింగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను కూడా మర్చిపోకూడదు.' అని రైనా అన్నాడు.
"భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ ఎంతో కీలకమైన మ్యాచ్. ముఖ్యంగా భారత్ మంచి ఆరంభం కావాలి. ఆ మ్యాచ్‌లో మనం బాగా విజయం సాధిస్తే, భారత్‌కు ఊపు రావడంతో పరిస్థితులు సజావుగా సాగుతాయి. టీ20ల్లో అది చాలా కీలకం". అని పేర్కొన్నాడు. అక్టోబర్ 23న మెల్‌బోర్న్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ