2022 టీ20 ప్రపంచ కప్ కోసం జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో ఆస్ట్రేలియా చేరిన కొద్ది రోజులకే మహ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్‌ను ప్రదర్శించాడు. ఈ వెటరన్ పేసర్ సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయాల్సి వచ్చింది. అది కూడా ఆఖరి ఓవర్. కానీ ఆ ఆరు బంతుల్లో అతను చేసిన బౌలింగ్ ప్రదర్శన అందరినీ ఊపిరి పీల్చుకునేలా చేసింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా షమీ బౌలింగ్‌కు ఇంప్రెస్ అయ్యాడు.
ప్రాక్టీస్ గేమ్‌లో రోహిత్ ఆశ్చర్యకరంగా షమీని మ్యాచ్‌లో ఎక్కువ భాగం బౌలింగ్‌కు దూరంగా ఉంచాడు. అయితే 20వ ఓవర్‌లో షమీకి బంతిని అందించి హిట్‌మ్యాన్ పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా ఆడిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఈ వెటరన్ పేసర్ ఒక్క బంతి కూడా వేయలేదు. కానీ బలమైన ఆస్ట్రేలియన్‌లపై చివరి ఓవర్లో 10 పరుగులు డిఫెండ్ చేసే టాస్క్‌ను అప్పగించారు.
మొదటి రెండు బంతుల్లో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చిన షమీ మూడో బంతికి ప్యాట్ కమిన్స్‌ను అవుట్ చేశాడు. బౌండరీ లైన్ దగ్గర విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్ పట్టడంతో కమిన్స్ ఆశ్చర్యపోతూనే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాతి బంతికి ఆస్టన్ అగర్ రనౌట్ అయ్యాడు. షమీ తర్వాతి రెండు బంతుల్లో జోష్ ఇంగ్లిస్, కేన్ రిచర్డ్‌సన్‌లను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా ఆస్ట్రేలియా 180 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ షమీకి ఒక ఓవర్ మాత్రమే ఎందుకు ఇచ్చాడో, అది కూడా ఆఖరి ఓవరే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వివరించాడు. "అతను (షమీ) చాలా కాలం తర్వాత తిరిగి వస్తున్నాడు, కాబట్టి మేం అతనికి ఒక ఓవర్ ఇవ్వాలనుకున్నాము. అతనికి ఒక ఛాలెంజ్ ఇవ్వాలని చివరి ఓవర్ ఇచ్చాం. షమి ఎంత గొప్ప బౌలింగ్ ప్రదర్శనను కనపరిచాడో అందరూ చూశారు" అని రోహిత్ చెప్పాడు.
బుమ్రా లేకపోవడంతో భారత్ పేస్ అటాక్‌కు నాయకత్వం వహించే పెద్ద బాధ్యత షమీపై ఉంది. వార్మప్ గేమ్‌లో అతను ఆస్ట్రేలియాపై బౌలింగ్ చేసిన విధానాన్ని పరిశీలిస్తే అతనిపై టీమ్ మేనేజ్‌మెంట్ విశ్వాసం ఖచ్చితంగా పెరుగుతుంది.
సోమవారం ఆస్ట్రేలియాతో ఆడిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఆరు పరుగులతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 187 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. మొదట్లో బాగానే ఆడిన ఆస్ట్రేలియా చివర్లో తడబడి 180 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ అరోన్ ఫించ్ (76) అర్ధ శతకంతో రాణించాడు. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (35) ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. కానీ డెత్ ఓవర్లలో భారత బౌలర్లు హర్షల్ పటేల్, షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించారు.
చివరి ఓవర్లో 11 పరుగులు సాధించాల్సిన స్థితిలో ఆస్ట్రేలియా బ్యాటర్లను షమీ కట్టడి చేశాడు. అయితే ఈ ఓవర్లో ప్యాట్ కమిన్స్ (7) కొట్టిన భారీ షాట్ సిక్సర్ వెళ్తుండగా కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. దీంతో కమిన్స్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఒక రనౌట్ కాగా, ఇంగ్లిస్ (1)ను షమీ బౌల్డ్ చేశాడు. అంతకుముందు 19వ ఓవర్లో ఫించ్‌ను హర్షల్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ భారత్ వైపు మారింది. షమీ 3 వికెట్లతో అదరగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టగా, చాహల్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (57), సూర్యకుమార్ యాదవ్ (50) రాణించారు.