IND vs AUS Warm-up Match:  టీ20 ప్రపంచకప్‌నకు సన్నద్ధం అవడంలో భాగంగా.. ఆస్ట్రేలియా (Australia)తో ఆడిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా (India) 6 పరుగులతో విజయం సాధించింది. డెత్ ఓవర్లలో భారత్ మ్యాజిక్ చేయడంతో ఆస్ట్రేలియా ఓటమి పాలయింది.






టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఈ మ్యాచ్‌లో భారత్.. 187 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. మొదట్లో బాగానే ఆడిన ఆస్ట్రేలియా చివర్లో తడబడి 180 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ అరోన్ ఫించ్ (76) అర్ధ శతకంతో రాణించాడు. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (35) ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. కానీ డెత్‌ ఓవర్లలో భారత బౌలర్లు హర్షల్ పటేల్, షమీ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించారు.


చివరి ఓవర్లో






అయితే చివరి ఓవర్లో 11 పరుగులు సాధించాల్సిన స్థితిలో ఆస్ట్రేలియా బ్యాటర్లను షమీ కట్టడి చేశాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌ వేశాడు. అయితే ఈ ఓవర్లో ప్యాట్ కమిన్స్ (7) కొట్టిన భారీ షాట్ సిక్సర్ వెళ్తుండగా కోహ్లీ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. దీంతో కమిన్స్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఒక రనౌట్ కాగా, ఇంగ్లిస్ (1)ను షమీ బౌల్డ్ చేశాడు. అంతకుముందు 19వ ఓవర్లో హర్షల్ పటేల్ ఫించ్‌ను క్లీన్‌ బౌల్డ్ చేయడంతో మ్యాచ్ భారత్ వైపు మారింది. షమీ 3 వికెట్లతో అదరగొట్టాడు. భువనేశ్వర్ కుమార్‌ 2 వికెట్లు పడగొట్టగా, చాహల్, అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు. 


ఆ ఇద్దరు


ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియాలో ఓపెనర్ కేఎల్ రాహుల్ (57), సూర్యకుమార్ యాదవ్ (50) రాణించారు. మిగతా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (19), దినేష్ కార్తీక్ (20) ఫర్వాలేదనిపించారు. కెప్టెన్ రోహిత్ శర్మ (15), హార్దిక్ పాండ్యా (2) నిరాశపరిచారు. లోయర్ ఆర్డర్ విఫలం కావడంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్‌సన్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆస్టన్ అగర్ తలో వికెట్ తీసుకున్నారు.


మెయిన్ టోర్నీకి ముందు ఆసీస్‌పై గెలుపు టీమిండియాకు బూస్ట్ ఇచ్చేలా కనిపిస్తోంది. డెత్ ఓవర్లలో ఇటీవల బాగా ఇబ్బంది పడుతోన్న భారత బౌలర్లు ఈ మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.


Also Read: నమీబియా చేతిలో శ్రీలంక ఓటమి - భారత్ జాగ్రత్త పడాల్సిందే - ఎందుకంటే?