T20 ప్రపంచ కప్ 2022 సూపర్ 12 రౌండ్ ఇంకా ప్రారంభం కాలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు క్వాలిఫయర్‌లపై దృష్టి పెట్టారు. సూపర్ 12లో ఖాళీగా ఉన్న 4 స్థానాల కోసం శ్రీలంక, వెస్టిండీస్, నమీబియా, స్కాట్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, యూఏఈ, జింబాబ్వే జట్లు ఇప్పటికే పోరాడుతున్నాయి. శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్‌లు ఫేవరెట్‌గా ఉన్నప్పటికీ, టోర్నమెంట్ ప్రారంభ రోజున లంకేయులు, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ అన్ని జట్లకు కళ్లు తెరిపించింది.


టీ20 ప్రపంచ కప్ 2022 ప్రారంభ రోజైన ఆదివారం గీలాంగ్‌లో జరిగిన మ్యాచ్‌లో నమీబియా చేతిలో శ్రీలంక 55 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవి చూసింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకేయులు నమీబియా బౌలర్ల ధాటికి 108 పరుగులకే ఆలౌట్ అయ్యారు.


ఆసియా కప్ చాంపియన్‌గా బరిలోకి దిగిన శ్రీలంకను నమీబియా లాంటి జట్టు ఓడించగలదనే వాస్తవం మొత్తం టోర్నమెంట్‌ను వైడ్ ఓపెన్ చేసింది. ఈ ఓటమి మొత్తం టోర్నీపై భారీ ప్రకంపనలు కలిగిస్తుంది. నిబంధనల ప్రకారం రెండు క్వాలిఫయర్‌ గ్రూప్‌ల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌ 12లో చేరుతాయి.


పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో కూడిన భారత్‌ గ్రూప్‌ విషయానికొస్తే గ్రూప్‌-బిలో విజేతగా నిలిచిన గ్రూప్‌-ఎలో రన్నరప్‌గా నిలిచిన జట్లతో చేరనుంది. గ్రూప్-బిలో వెస్టిండీస్ ఫేవరెట్‌గా ఉంది. అయితే గ్రూప్-ఏలో నమీబియా చేతిలో ఓటమితో శ్రీలంక అవకాశాలు సన్నగిల్లాయి.


అందువల్ల భారత ఉన్న గ్రూప్‌లో అగ్రస్థానం కోసం టీమిండియా, పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంకల మధ్య తీవ్రమైన పోరును చూడవచ్చు. ఇటీవల ఆసియా కప్‌లో లంకేయులు భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకోవడం గమనార్హం. ఈ టోర్నీలో భారత్‌ ఉన్న గ్రూప్‌-బి ‘గ్రూప్‌ ఆఫ్‌ డెత్‌’గా మారవచ్చు.