2022 T20 ప్రపంచ కప్ నేటి నుంచి ప్రారంభం అయింది. సూపర్ 12 రౌండ్ ప్రారంభమయ్యే ముందు క్వాలిఫైయర్‌లు మొదట నిర్వహిస్తారు. ఈ ఐసీసీ టోర్నమెంట్‌లో 'రిజర్వ్ డే'ని కలిగి ఉండే అవకాశాన్ని కూడా చేర్చింది. అయితే ఇది కేవలం సెమీ-ఫైనల్, ఫైనల్స్‌కు మాత్రమే. సెమీ ఫైనల్స్ మరియు ఫైనల్స్ నిర్ణీత రోజులలో జరగని సందర్భంలో, రిజర్వ్ డేలు అమలులోకి వస్తాయి.


ఒక ప్రధానమైన టోర్నమెంట్‌కు ఐసీసీ రిజర్వ్ డేస్‌ను పెట్టడం ఇదే మొదటిసారి కాదు. 2019 వన్డే ప్రపంచ కప్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీ-ఫైనల్ రిజర్వ్ రోజున జరిగింది. మ్యాచ్ జరగాల్సిన రోజున  మాంచెస్టర్‌లో నిరంతర వర్షం కురిసింది. దీంతో మ్యాచ్‌ను రిజర్వ్ డే రోజున నిర్వహించారు.


అయితే ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బంతితో ఆధిపత్యం చెలాయించడంతో భారత్ సెమీస్‌లోనే ఓటమి పాలై ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి వరకు ఆ ప్రపంచ కప్‌లో భారత్ కేవలం ఒక కేవలం గేమ్‌ను మాత్రమే ఓడిపోయింది. కానీ కివీ బౌలర్లు భారత టాప్ ఆర్డర్‌ను దెబ్బతీసి భారత్‌ను ఓడించారు. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అదే చివరి వన్డే మ్యాచ్.


రిజర్వ్ డే ఎప్పుడు అమలులోకి వస్తుంది?
సెమీ-ఫైనల్, ఫైనల్ షెడ్యూల్ తేదీలో 5 ఓవర్ల మ్యాచ్ కూడా సాధ్యం కాని పక్షంలో మాత్రమే రిజర్వ్ డే అమల్లోకి రానుంది. అప్పుడు మ్యాచ్ రిజర్వ్ డే రోజున జరుగుతుంది. వర్షం అంతరాయాలు లేదా ఇతర అనుకోని పరిస్థితుల కారణంగా ఇటువంటి పరిస్థితి రావచ్చు. 2022 టీ20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లు నవంబర్ 9వ తేదీ, 10వ తేదీల్లో జరగనున్నాయి. నవంబర్ 13వ తేదీన ఫైనల్ జరగనుంది.


నేడు జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో శ్రీలంకపై నమీబియా 55 పరుగులతో విజయం సాధించి సంచలనం సృష్టించింది. మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 19 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది.