వరుసగా రెండో సంవత్సరం కూడా ఐపీఎల్ వేలానికి బెంగళూరు  ఆతిథ్యం ఇవ్వనుందని తెలుస్తోంది. IPL 2023 కోసం మినీ-వేలం డిసెంబర్ 16వ తేదీన బెంగళూరులో జరగనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో IPL 2022 మెగా వేలానికి కూడా బెంగళూరే ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు డిసెంబర్‌లో మరోసారి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మినీ వేలం ఈవెంట్‌కు కూడా వేదిక కానుందని తెలుస్తోంది.


బీసీసీఐ ఒకే ఏడాదిలో రెండు వేలాలు నిర్వహించడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. ఇంతకుముందు 2018లో కూడా మెగా వేలం, మినీ వేలం ఒక సంవత్సరంలో జరిగాయి. ఐపీఎల్ ఫ్రాంచైజీల పర్స్‌లో పెరుగుదల ఉంటుంది. వారు రూ.95 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చు. ఇది మినీ వేలం కాబట్టి, ఈవెంట్ సమయంలో ఫ్రాంచైజీలు మొత్తం నగదును వెచ్చించే అవకాశం లేదు. వచ్చే నెలాఖరులోగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేయనున్నారు.


హాట్ కేక్ రవీంద్ర జడేజానే!
IPL 2023 మినీ వేలంలోకి వెళుతున్నప్పుడు, అందరి దృష్టి రవీంద్ర జడేజాపైనే ఉంది. ఈ స్టార్ ఆల్ రౌండర్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో కొనసాగుతాడా లేదా అనేది తెలియదు. జడేజా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుంచి ఫ్రాంచైజీకి సంబంధించిన అన్ని పోస్ట్‌లను తొలగించడం ద్వారా CSK నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఇన్‌డైరెక్ట్‌గా సూచించాడు. అతను ట్విట్టర్‌లో ఫ్రాంచైజీకి తెలిపిన హృదయపూర్వక ప్రతిస్పందనను కూడా తొలగించాడు.


ఈ విషయంపై ఫ్రాంచైజీ గానీ, ఆటగాళ్లు గానీ స్పందించలేదు. మినీ వేలానికి ముందే ఫ్రాంచైజీలు రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేయనుంది. దీంతో అభిమానుల నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. రవీంద్ర జడేజాను తమకు ఇచ్చేయమని ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను కోరినట్లు వార్తలు వస్తున్నాయి.


IPL 2023 దేశంలోని వివిధ నగరాల్లో జరుగుతుంది. జట్లు తమ మ్యాచ్‌లలో సగం హోం గ్రౌండ్‌లో, మిగిలిన మ్యాచ్‌లను ప్రత్యర్థుల మైదానాల్లో ఆడతాయి. ఎంఎస్ ధోని మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహించడం ఖాయమైంది.