ArrestKohli On Twitter: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలంటూ శనివారం ఉదయం నుంచి ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. కొంతమంది ఉద్దేశపూర్వకంగా #ArrestKohli అన్న హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. తమిళనాడులో విరాట్, రోహిత్ ఫ్యాన్స్ తాగిన మత్తులో గొడవపడి దాడి చేసుకోగా ఒకరు మరణించడమే ఇందుకు కారణం! కొట్టుకున్న ఇద్దరూ మిత్రులే కావడం గమనార్హం.
ఎస్.ధర్మరాజ్, పి.విజ్ఞేశ్ (24) ఇద్దరూ మిత్రులే. వీరిది తమిళనాడులోని అరియలూరు జిల్లాలోని పొయ్యూరు గ్రామం. ఇందులో ధర్మరాజ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్. విజ్ఞేశ్‌కు రోహిత్ అంటే ఇష్టం. అతడు ఐటీఐ పూర్తి చేసుకొని సింగపూర్ వీసా కోసం ఎదురు చూస్తున్నాడు. మంగళవారం రాత్రి వీరిద్దరూ మల్లూరులోని సిడ్కో ఇండస్ట్రియల్ ఎస్టేల్‌లో మద్యపానం చేశారు. అక్కడే బహిరంగంగా క్రికెట్ గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు.
'వీరిద్దరూ మద్యం సేవించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం విజ్ఞేశ్ ఇండియన్ ప్రీమియర్ లీగులో ముంబయి ఇండియన్స్ అభిమాని. ధర్మరాజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మద్దతుదారు' అని కీలాపాలూర్ పోలీసులు తెలిపారు.
'వాదన జరుగుతుండగా ఆర్సీబీ, విరాట్ కోహ్లీని విజ్ఞేశ్ వెక్కిరించాడు. అదే సమయంలో ధర్మరాజ్‌ను బాడీ షేమింగ్ చేశాడు. అతడికి నత్తి ఉంది. ఈ బలహీనతను పోలిస్తూ అతడు ఆర్సీబీని ఎగతాళి చేశాడు. ఆగ్రహానికి గురైన ధర్మరాజ్ సీసా తీసుకొని విజ్ఞేశ్‌ను కొట్టాడు. క్రికెట్ బ్యాటుతో తలపై బాది పారిపోయాడు' అని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయం బయటకు రావడంతో అరెస్టు కోహ్లీ అంటూ కొందరు హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ చేయడం మొదలు పెట్టారు.