2022 టీ20 ప్రపంచకప్ క్రేజీ నోట్‌తో స్టార్ట్ అయింది. క్వాలిఫయర్స్ మొదటి మ్యాచ్‌లోనే శ్రీలంకపై నమీబియా 55 పరుగులతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 19 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన నమీబియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు మైకేల్ వాన్ లింజెన్, డివిన్ లా కాక్ స్కోరు బోర్డు మీద 16 పరుగులు చేరేసరికి పెవిలియన్ బాట పట్టారు. ఆ తర్వాత వచ్చిన వారు కూడా నిదానంగా ఆడటంతో పాటు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో నమీబియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.
అయితే చివర్లో జాన్ ఫ్రిలింక్, జేజే స్మిత్ వేగంగా ఆడటంతో నమీబియా పోరాడదగ్గ స్కోరు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో ప్రమోద్ మదుషన్ రెండు వికెట్లు, మహీష్ తీక్షణ, దుష్మంత చమీర, చమిక కరుణరత్నే, వనిందు హసరంగ తలో వికెట్ తీసుకున్నారు.
అనంతరం శ్రీలంక బ్యాటర్లలో దసున్ షనక, భానుక రాజపక్స, దనుష్క గుణతిలక మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. నమీబియా బౌలర్లు శ్రీలంకకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో లంకేయులు 19 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయింది. నమీబియా బౌలర్లలో డేవిడ్ వీస్, బెర్నాల్డ్ స్కోల్జ్, బెన్ షికోంగో, జాన్ ఫ్రిలింక్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. జేజే స్మిత్‌కు ఒక వికెట్ దక్కింది.