Womens Asia Cup Final: ఆసియా కప్‌ అంటే ఇండియా! ఇండియా అంటే ఆసియాకప్‌! అమ్మాయిల జట్టు అదరగొట్టింది! చరిత్రలో కనీవినీ ఎరగని ఫీట్‌ సాధించింది. ఏడోసారి మహిళల ఆసియాకప్‌ టోర్నీ విజేతగా ఆవిర్భవించింది. ఈ ఖండంలో తమ క్రికెట్‌కు తిరుగులేదని చాటిచెప్పింది! షైలెట్‌ వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తు చిత్తుగా ఓడించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 2 వికెట్లు నష్టపోయి ఛేదించింది. 8.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. స్మృతి మంధాన (51; 25 బంతుల్లో 6x4, 3x6) అజేయ హాఫ్‌ సెంచరీ సాధించింది. ఇనోకా రణవీర (18*; 22 బంతుల్లో 2x4) లంకలో టాప్‌ స్కోరర్‌. రేణుకా సింగ్‌ (3/5), రాజేశ్వరీ గైక్వాడ్‌ (2/16), స్నేహ్‌ రాణా (2/13) బంతితో చుక్కలు చూపించారు. 




స్మృతి దూకుడు


కఠినమైన పిచ్‌.. విపరీతంగా టర్న్‌ అవుతున్న వికెట్‌.. ఎదురుగా స్వల్ప లక్ష్యం..! దాంతో టీమ్‌ఇండియా ఎక్కడా అనవసరమైన రిస్క్‌ తీసుకోలేదు. స్మృతి మంధాన తనదైన రీతిలో షాట్లు ఆడింది. బౌండరీలు, సిక్సర్లు బాదింది. మరోవైపు దూకుడుగా ఆడే క్రమంలో ఓపెనర్‌ షెఫాలీ ర్మ (5; 8 బంతుల్లో) జట్టు స్కోరు 32 వద్ద ఔటైంది. రణవీర బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్‌ అయింది. మరో మూడు పరుగులకే జెమీమా రోడ్రిగ్స్‌ (2) ముందుకొచ్చి ఆడి బౌల్డ్‌ అయింది. దీంతో కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ (11; 14 బంతుల్లో 1x4,) ముందుగానే క్రీజులోకి వచ్చింది. మరో వికెట్‌ పడకుండా మంధానకు సపోర్ట్‌ చేసింది. 




స్పిన్‌కు విలవిల


టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు వరుస షాకులు తగిలాయి. టీమ్‌ఇండియా అద్భుత బౌలింగ్‌కు తోడు సొంత తప్పిదాలు వారి కొంప ముంచాయి. స్పిన్‌కు విపరీతంగా అనుకూలిస్తున్న పిచ్‌పై బ్యాటింగ్‌ ఎంచుకోవడం మొదటి తప్పు! బాగా ఆడే ఓపెనర్లు చమరీ ఆటపట్టు (6), అనుష్క సంజీవని (2) సమన్వయ లోపంతో రనౌట్‌ అయ్యారు. మూడో ఓవర్లో జట్టు స్కోరు 8 వద్ద ఆటపట్టు వెనుదిరిగింది. ఆ తర్వాత రేణుకా సింగ్‌ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడ్డాయి. మూడో బంతికి హర్షిత (0) క్యాచ్‌ ఔట్‌ అయింది. నాలుగో బంతికి సంజీవని రనౌట్‌. ఐదో బంతికి హాసిని పెరీరా పెవిలియన్‌ చేరింది. వీరంతా 9 వద్దే ఔటవ్వడం గమనార్హం. ఆ తర్వాత రాజేశ్వరీ, స్నేహ్‌ రాణా బౌలింగ్‌లో రెచ్చిపోవడంతో లంక ఎక్కడా కోలుకోలేదు. ఓషది రణసింఘె (13; 20 బంతుల్లో 1x4) పోరాడటంతో చివరికి 65/9తో నిలిచింది.