T20 World Cup IND vs PAK:  ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు మెరుగ్గా సన్నద్ధం అయ్యామని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ఇప్పటికే పాకిస్థాన్‌ మ్యాచుకు జట్టును ఎంపిక చేసుకున్నానని పేర్కొన్నాడు. ఆఖరి నిమిషాల్లో నిర్ణయాలకు తాను వ్యతిరేకమని వెల్లడించాడు. ఆటగాళ్లకు ముందుగానే కంఫర్ట్‌ అందించడం ముఖ్యమన్నాడు. 2007తో పోలిస్తే టీ20 ఫార్మాట్‌ ఎలా మారిందో వివరించాడు. టీ20 ప్రపంచకప్‌ కెప్టెన్లతో ఐసీసీ మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.


'ఆఖరి నిమిషాల్లో నిర్ణయాలపై నాకు నమ్మకం లేదు. జట్టు ఎంపిక గురించి మా కుర్రాళ్లకు ముందుగానే తెలియాలని భావిస్తాను. అప్పుడే వారు త్వరగా సిద్ధమవుతారు. పాకిస్థాన్‌ మ్యాచ్‌కు నా జట్టును ఎప్పుడో ఎంపిక చేశాను. వారిని నిర్ణయం చెప్పేశాను. వారు బాగా సన్నద్ధం కావాలని కోరుకుంటున్నా' అని రోహిత్ చెప్పాడు.


పేసర్‌ మహ్మద్‌ షమికి తొలి మ్యాచులో అవకాశం దక్కకపోవచ్చని సమాచారం. 'ఇప్పటికైతే షమిని నేను చూడలేదు. కానీ అతడి గురించి మంచి విషయాలు వింటున్నా. బ్రిస్బేన్‌లో ప్రాక్టీస్ మ్యాచ్‌లో అతడిని పరిశీలిస్తా' అని హిట్‌మ్యాన్‌ వివరించాడు. పాక్‌ మ్యాచ్‌ గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదన్నాడు. 'భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ప్రాముఖ్యం గురించి మాకు తెలుసు. కానీ ప్రతిసారీ మ్యాచ్‌ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆసియాకప్‌ సమయంలో కుటుంబ సభ్యులు, కార్ల గురించి మాట్లాడుకున్నాం' అని పేర్కొన్నాడు.


జస్ప్రీత్‌ బుమ్రా లేకపోవడం బాధాకరమేనని రోహిత్‌ అన్నాడు. అయితే గాయాల గురించి నిరాశపడొద్దని పేర్కొన్నాడు. 'మేమేం చేయగలమో చూడాలి. మేం మా కుర్రాళ్లకు అండగా ఉంటాం. వారినెప్పుడూ ప్రోత్సహిస్తాం. వారు బాగా ఆడతారనే నమ్మకం ఉంది. ఆసీస్‌కు ముందుగా వచ్చి అలవాటు పడాలని అనుకున్నాం. పాక్‌ మ్యాచ్‌ వచ్చే సమయానికి మేం సిద్ధంగా ఉంటాం. ఏ ఆటగాడికైనా ఆఖరి నిమిషంలో ఆడుతున్నావని చెప్పడం ఇష్టం ఉండదు. సూర్యకుమార్‌ మా జట్టులో ఎక్స్‌ ఫ్యాక్టర్‌ అవుతాడు. ఇదే ఫామ్‌ కొనసాగిస్తాడని ఆశిస్తున్నా' అని వెల్లడించాడు.


'2007లో టీ20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేసినప్పుడు నాపై ఎలాంటి అంచనాల్లేవ్‌. నా తొలి ప్రపంచకప్‌ కావడంతో టోర్నీని ఎంజాయ్‌ చేద్దామని అనుకున్నా. మెగా టోర్నీలో ఆడితే ఎలా ఉంటుందో తెలియదు. గెలిచిన తర్వాతే దాని గురించి తెలిసింది. అప్పట్లో 140-150 కొడితే మంచి స్కోర్‌ అనిపించేది. ఇప్పుడు 14-15 ఓవర్లకే కొట్టేస్తున్నారు. ఆట ఫియర్‌లెస్‌గా మారింది. మేమూ అలాగే ఆడాలని కోరుకుంటున్నాం' అని రోహిత్‌ చెప్పాడు.