ప్రపంచంలో ఎక్కువమంది మహిళలను వేధిస్తున్న సమస్య అధిక బరువు లేదా ఊబకాయం. కారణం తెలియకుండా చాలా మంది మహిళలు ప్రపంచంలో లావైపోతారు. ఎందుకో లావైపోయారో వారికి కూడా అర్థం కాదు. ఆహారం తక్కువ తింటున్నాం కదా అనుకుంటారు. అధిక బరువు బారిన పడడానికి చాలా కారణాలు ఉంటాయి. కుటుంబ చరిత్ర, ఏదైనా తెలియని ఆరోగ్య సమస్య, శారీరక శ్రమ లేకపోవడం... ఇలా ఏ కారణం అయినా కావచ్చు. ఇప్పుడు మరో కొత్త కారణం కూడా ఈ జాబితాలో చేరింది. అదే వాయు కాలుష్యం. నమ్మశక్యంగా లేనప్పటికీ ఇది నిజం. వాయు కాలుష్యం వల్ల కూడా ఆడవారు తమకు తెలియకుండానే లావు అయిపోతారట. ఎవరైతే రోజూ వాయు కాలుష్యం బారిన పడతారో వారు త్వరగా బరువు పెరుగుతున్నట్టు పరిశోధకులు చెప్పారు. 


అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. కేవలం వాయు కాలుష్యానికి గురవ్వడం వల్లే మహిళల్లో కొవ్వు శాతం పెరిగిందని చెప్పారు పరిశోధకులు. ముఖ్యంగా మధ్య వయసులో ఉన్న మహిళల్లో వాయు కాలుష్యం వల్ల బరువు పెరుగుతున్నట్టు గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను డయాబెటిస్ కేర్ జర్నల్ లో ప్రచురించారు. కేవలం వాయు కాలుష్యం వల్లే శరీరంలోని కొంతమంది మహిళల్లో కిలోకి పైగా పెరిగినట్టు గుర్తించారు. 


ఆ వయసులో ఎక్కువ...
40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలపై వాయు కాలుష్యం తీవ్రంగా ప్రభావం చూపిస్తోందని చెప్పారు అధ్యయనకర్తలు. ఈ అధ్యయనం కోసం 1600కు పైగా చైనీస్, జపనీస్, ఆఫ్రికా మహిళలను ఎంపిక చేశారు. వారి వయసు సగటుగా 50 ఏళ్లు ఉండేట్టు చూసుకున్నారు. వీరి ఆరోగ్యాన్ని, బరువును 2000 సంవత్సరం నుంచి 2008 వరకు ట్రాక్ చేశారు. వాయు కాలుష్యం, శారీరక శ్రమ మధ్య పరస్పర చర్యలను పరిశోధకులు అధ్యయనం చేశారు. అందులో వాయుకాలుష్యానికి అధికంగా గురవుతున్న మహిళల శరీరంలో కొవ్వు శాతం పెరిగినట్టు గుర్తించారు. కాబట్టి మహిళలు వాయు కాలుష్యానికి అధికంగా గురికకాపోవడమే మంచిదని చెబుతున్నారు పరిశోధకులు.


Also read: ఎక్కువ గంటల పాటూ హైహీల్స్‌తో ఉంటే ఎంత ప్రమాదమో తెలుసా?

















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.