Congress President Election 2022:


పోలింగ్‌కు అంతా సిద్ధం..


చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. 20 ఏళ్ల తరవాత కాంగ్రెసేతర కుటుంబానికి ఈ పగ్గాలు అందనున్నాయి. మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ అధ్యక్ష ఎన్నికలో పోటీ పడుతున్నారు. గాంధీ కుటుంబానికి చెందిన వాళ్లెవరూ ఈ రేసులో లేరు. అందుకే...ఖర్గే, థరూర్‌లో ఎవరు ఎన్నికవుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల పార్టీల ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొంటారు. ప్రత్యేక పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేస్తారు. AICC ఆఫీస్‌లో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఓటు వేశారు.  పోలింగ్ పూర్తయ్యాక...అక్టోబర్ 18న (రేపు) బ్యాలెట్‌ బాక్స్‌లను ఢిల్లీకి చేర్చుతారు. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఖర్గే ఎన్నిక లాంఛనమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు థరూర్‌నీ సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలూ మొదటి నుంచి ఒకే విషయం చెబుతున్నారు. "మా ఎన్నికపై అధిష్ఠానం ప్రభావం ఏమీ ఉండదు" అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే...పార్టీ ఎవరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే వారికే ఆ పదవి కట్టబెడతారు తప్ప...ప్రత్యేకించి గాంధీ కుటుంబం ఎవరినీ ప్రతిపాదించదు. 


ఎన్నో మలుపులు..


ఎవరిపైనాపక్షపాతం ఉండదని చెబుతున్నా...శశిథరూర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కాస్త సంచలనమయ్యాయి. భారత్ జోడో యాత్రలో మల్లికార్జున్ ఖర్గేను కాంగ్రెస్ నేతలందరూ ఆహ్వానించి ఆయనతో మాట్లాడారని, తనను మాత్రం పెద్దగా పట్టించుకోలేదని ఘాటైన కామెంట్స్ చేశారు థరూర్. అటు ఖర్గే మాత్రం "అధిష్ఠానం ఆదేశాల మేరకే నడుచుకుంటా. అది ఏ నిర్ణయమైనా సరే" అని స్పష్టం చేశారు. అంతే కాదు. పార్టీ నేతల మద్దతు కోరడం తన విధి అని వెల్లడించారు. అసలు ఈ పోటీలో ఎవరుంటారన్నది చివరి నిముషం వరకూ ఉత్కంఠగానే సాగింది. ఎన్నో మలుపులు తిరిగి...ఖర్గే, థరూర్ పేర్లు ఖరారయ్యాయి. ఖర్గే పేరు అనుకోకుండా తెరపైకి వచ్చింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోట్‌కే అధ్యక్ష పదవి దక్కుతుందని అందరూ గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే...ఉన్నట్టుండి రాజస్థాన్ రాజకీయాలు మారిపోయాయి. సచిన్ పైలట్, గహ్లోట్ వర్గాలుగా పార్టీ చీలిపోయింది. సచిన్ పైలట్‌కు సీఎం పదవి ఇవ్వకూడదని భీష్మించుకు కూర్చున్నారు గహ్లోట్. 


ఎవరో విజేత..


ఒకే వ్యక్తి ఒకే పదవి అనే నిబంధన ప్రకారం...గహ్లోట్ పార్టీ అధ్యక్షుడైతే...రాజస్థాన్ సీఎంగా కొనసాగేందుకు వీలుండదు. ఈ విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిష్ఠానం నిబంధనకు ఆయన కట్టుబడలేదు. ఫలితంగా...అధిష్ఠానం ఆగ్రహానికి గురయ్యారు. చివరకు రేసులో నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ తరవాత దిగ్విజయ్ సింగ్ పేరు వినిపించినా...ఆయనా చివరి నిముషంలో నామినేషన్ వేయకుండా ఉపసంహరించుకున్నారు. ఇన్ని మలుపుల తరవాత ఖర్గే, థరూర్ పేర్లు ఖరారయ్యాయి. ఇద్దరూ నామినేషన్ వేశారు. 20 ఏళ్ల తరవాత జరుగుతున్న ఎన్నిక అవటం వల్ల ఎవరు విజేతగా నిలుస్తారన్న ఆసక్తి నెలకొంది. 


Also Read: Telangana Politics : హైదరాబాద్‌లో నవీన్ పట్నాయక్ - ఢిల్లీలోనే కేసీఆర్ ! ఒరిస్సా సీఎంతో భేటీకి సుముఖంగా లేరా ?