'రాజా రాజా... ఐటమ్ రాజా...

రోజా రోజా... క్రేజీ రోజా...

విజిలేసి... గుండెల్లోనా!

డీజే డీజే కొట్టేసిందా?'

- 'డీజే టిల్లు' సినిమాలో రెండో పాటలో మొదట వినిపించే లిరిక్స్ ఇవి.

సిద్ధూ జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా 'డీజే టిల్లు'. విమల్ కృష్ణ దర్శకుడు. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలిసి నిర్మిసున్న చిత్రమిది. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. 'టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల' అంటూ రామ్ మిరియాల పాడిన పాటను ఆల్రెడీ విడుదల చేశారు. ఈ రోజు రెండో పాట 'పటాస్ పిల్ల... పటాస్ పిల్ల'ను విడుదల చేశారు. దీనిని యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ పాడటం విశేషం. ఈ పాటను కిట్టూ విస్సాప్రగడ రాశారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

 

'పటాస్ పిల్ల పటాస్ పిల్ల' సాంగ్ విడుదలైన సందర్భంగా కిట్టూ విస్సాప్రగడ మాట్లాడుతూ "నాకు సంగీత దర్శకుడు శ్రీచరణ్ ముందు పల్లవి వరకు ట్యూన్ పంపించారు. అది విన్నప్పుడు హుక్ లైన్ దగ్గర 'పటాసు పిల్లా...' అని తట్టింది. మా దర్శకుడితో పాటు మిగతా అందరికీ నచ్చింది. ఆ తర్వాత దర్శకుడిని పాట సందర్భం ఏమిటో అడిగి తెలుసుకుని రాశా. పాటలో ఎటువంటి సన్నివేశాలు ఉంటాయో? విమల్ నాకు చాలా వివరంగా కళ్ళకు కట్టినట్టు రాసి పంపారు. అందువల్ల, కొత్తగా రాయడం... పోలికలు వాడటం సాధ్యపడింది. శ్రీచరణ్ సంగీతంలో దాదాపు 30 పాటలు రాసి ఉంటాను. ఆ అనుభవం వల్ల ఇంకాస్త త్వరగా పాట పూర్తయ్యింది. మా కష్టానికి అనిరుధ్ గొంతు తోడైతే... పాట మరో స్థాయికి వెళుతుందని నమ్మకం కలిగింది. ప్రేక్షకులకు పాట నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని చెప్పారు.





యువతరం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన చిత్రమిది. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు యువతను ఆకట్టుకునేలా ఉన్నాయి. నిజం చెప్పాలంటే... సంక్రాంతికి సినిమా విడుదల  చేయాలని అనుకున్నారు. కానీ, కరోనా పరిస్థితుల వల్ల కుదరలేదు. త్వరలో కొత్త విడుదల తేదీ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ నటించిన ఈ చిత్రానికి పీడీవీ ప్రసాద్ సమర్పకులు. విమల్ కృష్ణతో కలిసి సిద్ధూ జొన్నలగడ్డ కథ రాశారు.