ఇల్లు కట్టుకుంటే సరిపోతుందా? ఇంట్లో ఫర్నిచర్ కూడా ఉండాలి! అదీ నచ్చినట్టు ఉండాలి! ఈ విషయంలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ముందు నుంచి చాలా ప్లాన్ చేసుకున్నారు. తన అభిరుచికి తగ్గట్టు ఇల్లు కట్టించుకోవడమే కాదు... తనకు నచ్చిన ఫర్నిచర్, ఇంట్లో వస్తువులను ముందు నుంచి కొనడం స్టార్ట్ చేశారు.

 

షూటింగ్స్ కోసం పూజా హెగ్డే విదేశాలు వెళ్లి వస్తుంటారు కదా! అలాగే, దేశంలో వివిధ నగరాలు కూడా తిరుగుతుంటారు. ఏడాది నుంచి అలా ఎక్కడికి వెళ్లినా ఇంటి కోసం ఏదో ఒకటి కొనడం స్టార్ట్ చేశారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే... మరో వైపు ఇంటి పనులు చూసుకోవడం, ఇంటికి ఏం కావాలో కొనుక్కోవడం ఆమె పనుల్లో భాగం అయ్యింది. ఇల్లు పూర్తయిన తర్వాత కొనాలని అనుకోకుండా ముందు నుంచి ప్లాన్ ప్రకారం కొనడంతో ఇల్లు పూర్తయ్యేసరికి ఫర్నిచర్, ఇతర వస్తువులు అన్నీ కొనేశారు. ఇంటి డిజైన్, ఫర్నిచర్ సెలక్షన్ విషయంలో తనకు తల్లి (లతా హెగ్డే) ఎంతో హెల్ప్ చేశారని పూజా హెగ్డే పేర్కొన్నారు. ఇల్లు సెలెక్ట్ చేసుకునే విషయంలో తల్లితో పాటు తండ్రి (మంజునాథ్ హెగ్డే) హెల్ప్ కూడా ఉందన్నారు.

 

అన్నట్టు... పూజా హెగ్డే సొంతింటికి ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? సీ ఫేసింగ్ హౌస్! ఆమె ఇంట్లో కూర్చుని అలా బయటకు చూస్తే... ముంబై మహాసముద్రం కనిపిస్తుంది. పూజా హెగ్డే ఏరి కోరి సీ ఫేసింగ్ హౌస్ తీసుకున్నారు. ముంబైలో చాలా మంది సెలబ్రిటీలు సీ ఫేసింగ్ హౌస్ తీసుకోవడనికి ఇష్టపడతారు. అదీ సంగతి!

 

ఇక సినిమాలకు వస్తే... ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధే శ్యామ్' విడుదలకు రెడీగా ఉంది. అలాగే, రామ్ చ‌ర‌ణ్‌కు జోడీగా ఆమె క‌నిపించిన‌ 'ఆచార్య' కూడా! తమిళంలో విజయ్ సరసన 'బీస్ట్', హిందీలో ర‌ణ్‌వీర్ సింగ్‌కు జోడీగా 'సర్కస్' సినిమాలు చేస్తున్నారు పూజా హెగ్డే. ఆ రెండూ సెట్స్ మీద ఉన్నాయి. సూపర్  స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రూపొందనున్న సినిమాలో కూడా పూజా హెగ్డేయే హీరోయిన్.