హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam), సముద్రఖని, శివాత్మికా రాజశేఖర్, రాహుల్‌ విజయ్‌, నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య మహర్షి, ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'పంచతంత్రం' (Panchathantram Movie). గత ఏడాది విడుదలైంది. డిసెంబర్ 9న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. 


మార్చి 22న ఈటీవీ ఓటీటీలో
ఉగాది సందర్భంగా 'పంచతంత్రం' ఓటీటీలో సందడి చేయనుంది. మార్చి 22న ఈటీవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫార్మ్ 'ఈటీవీ విన్' ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది. బహుశా... ఈ మధ్య కాలంలో ఈటీవీ సంస్థ నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్న తొలి సినిమా 'పంచతంత్రం' అనుకోవచ్చు. 'పంచతంత్రం' శాటిలైట్ హక్కులను సైతం ఈటీవీ సొంతం చేసుకుంది. ఓటీటీ వేదికలో సినిమా విడుదలైన కొన్ని రోజులకు టీవీలో ప్రసారం చేసే ఆలోచనలో ఉన్నారట. 


పంచేంద్రియాలు థీమ్‌!
ఐదు కథల సమాహారంగా 'పంచతంత్రం' రూపొందింది. ప్రేమ‌, భ‌యం, చావు, న‌మ్మ‌కం, లక్ష్యం... ఒక్కో కథలో ఒక్కో భావోద్వేగాన్ని చెప్పారు. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, నటి స్వాతి ఐదు కథల్లో పాత్రలను పరిచయం చేశారు. ది వీకెండ్ షో స‌మ‌ర్ప‌ణ‌లో టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజిన‌ల్స్ బ్యాన‌ర్స్‌పై హ‌ర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వంలో అఖిలేష్ వ‌ర్ధ‌న్‌, స్రుజ‌న్ ఎర‌బోలు ఈ అంథాల‌జీని నిర్మించారు. దర్శకుడు హర్షకు ఇది తొలి సినిమా. అయినప్పటికీ... చాలా చక్కగా తెరకెక్కించారని ప్రశంసలు వచ్చాయి. భావోద్వేగభరిత చిత్రమని పేరు వచ్చింది.


Also Read : రాజమౌళి అవార్డులు మీద ఎప్పుడూ దృష్టి పెట్టలేదట






పంచతంత్రంలో కథలు ఏమిటంటే?
వేదవ్యాస్ (బ్రహ్మానందం) ఆలిండియా రేడియోలో పనిచేసి రిటైర్ అవుతారు. తండ్రి ఇంట్లో సంతోషంగా ఉండాలని కుమార్తె రోషిణి (స్వాతి) కోరిక. స్టాండప్ స్టోరీ టెల్లింగ్ పోటీలకు తండ్రి వెళతానంటే నిరుత్సాహపరుస్తుంది. కెరీర్ అంటే ఇరవైల్లోనేనా... అరవైల్లో కూడా మొదలు పెట్టొచ్చనే మనిషి వేదవ్యాస్. అమ్మాయి మాటను కాదని మరీ పోటీలకు వెళతాడు. పంచేద్రియాలు థీమ్‌తో ఐదు కథలు చెబుతారు. 


మొదటి కథ : విహారి (నరేష్ అగస్త్య) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. పని ఒత్తిడి కారణంగా కొన్ని విషయాల్లో అసహనం, ఆగ్రహానికి లోనవుతాడు. సముద్రానికి, అతడికి ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో మన కళ్ళకు కనిపించే దృశ్యం ఎటువంటి పాత్ర పోషించింది? అనేది తెరపై చూడాలి. 


రెండో కథ : సుభాష్ (రాహుల్ విజయ్) కి పెళ్లి గురించి నిర్దిష్టమైన అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్న ఈతరం యువకుడు. కొన్ని సంబంధాలు చూసి రిజెక్ట్ చేస్తాడు. కుమారుడికి సరైన సంబంధం చూడలేకపోతున్నాని తల్లి బాధపడుతుంటే... నెక్స్ట్ ఏ సంబంధం వచ్చినా చేసుకుంటానని చెబుతాడు. అప్పుడు లేఖ (శివాత్మికా రాజశేఖర్) వాళ్ళింటికి వెళతాడు. తొలి పరిచయంలో అమ్మాయితో ఏం మాట్లాడడు. మాట్లాడేది ఏమీ లేదంటాడు. పెళ్లి సంబంధం ఓకే అవుతుంది. ఆ తర్వాత లేఖ నుంచి సుభాష్‌కు ఫోన్ వస్తుంది. అప్పుడు ఏమైంది? ఈ కథలో రుచి ఎటువంటి పాత్ర పోషించింది? అనేది తెరపై చూడాలి. 


మూడో కథ : రామనాథం (సముద్రఖని) బ్యాంకులో పనిచేసి రిటైర్ అవుతారు. భార్య (దివ్యవాణి), ఆయన... ఇంట్లో ఇద్దరే ఉంటారు. నెలలు నిండిన కుమార్తె, అల్లుడు వేరే చోట ఉంటారు. రామనాథం ముక్కుకు ఏదో వాసన వస్తుంది. అదేంటి? ఆ వాసన ఆయనకు మాత్రమే ఎందుకు వస్తుంది? భార్యకు ఎందుకు రావడం లేదు? అనేది స్క్రీన్ మీద చూడాలి. 


నాలుగో కథ : శేఖర్ (వికాస్ ముప్పాల) భార్య దేవి (దివ్య శ్రీపాద) ప్రెగ్నెంట్. ఆమెకు క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. దాంతో ఆమెను వదిలేసి వేరే పెళ్లి చేసుకోమని శేఖర్ తండ్రి సలహా ఇస్తాడు. కడుపు వల్ల వ్యాధి వచ్చిందని అబార్షన్ చేయించుకోమని దేవి తల్లి చెబుతుంది. అప్పుడు శేఖర్, దేవి ఏం చేశారు? స్పర్శ ఎలాంటి పాత్ర పోషించింది? అనేది తర్వాత కథ.
 
ఐదో కథ : లియా అలియాస్ చిత్ర (స్వాతి రెడ్డి) చెప్పే కథలకు చిన్నారుల్లో చాలా మంది అభిమానులు ఉంటారు. ఓ డ్రైవర్ (ఉత్తేజ్) పదేళ్ళ కుమార్తె వారిలో ఒకరు. చిత్ర, ఆ చిన్నారి... ఇద్దరికీ కాళ్ళు కదలవు. అయితే... ఆ కథలు, ధ్వని (వినికిడి) వాళ్ళతో పాటు కుటుంబ సభ్యుల జీవితాల్లో ఎటువంటి మార్పు తీసుకొచ్చింది? అనేది మిగతా కథ.