'నాటు నాటు...' (Naatu Naatu Song) పాటకు ఆస్కార్ అవార్డు (Oscars 2023 Winners) వచ్చింది. దాంతో ఒక్క 'ఆర్ఆర్ఆర్' సినిమాకు పని చేసిన సభ్యులు మాత్రమే కాదు, యావత్ దేశం అంతా సంబరం చేసుకుంది. అఫ్ కోర్స్... కొంత మంది విమర్శలు కూడా చేశారనుకోండి. కామెంట్ చేసిన వాళ్ళ పర్సంటేజ్ తక్కువ.


ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి... 'ఆర్ఆర్ఆర్' సినిమాపై, రాజమౌళి అండ్ టీమ్ ఆస్కార్ అవార్డు జర్నీపై కొందరు చేసిన విమర్శలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం లభించింది. ఆస్కార్ అవార్డుకు 'ఆర్ఆర్ఆర్' టీమ్ అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లకు సుమారు రూ. 85 కోట్ల ఖర్చు చేశారని హిందీ నుంచి తెలుగు వరకు చాలా మంది చెప్పారు. నిజంగా రాజమౌళి ఆస్కార్ కోసం అంత తీవ్రంగా ప్రయత్నించారా? అంటే... ఆయన కుటుంబ సభ్యుడు చెప్పే మాటలను బట్టి లేదని చెప్పాలి.


ప్రేక్షకులకు చెంతకు చేరాలని...
కీరవాణి సోదరుడు, సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్ పని చేసిన తాజా సినిమా 'ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి' (Phalana Abbayi Phalana Ammayi). దీనికి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించారు. ఈ శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సుమ కనకాల (Suma Kanakala) హోస్ట్ చేస్తున్న 'సుమ అడ్డా' కార్యక్రమానికి చిత్ర బృందంతో కలిసి కళ్యాణీ మాలిక్ వచ్చారు. ఆస్కార్ వచ్చినందుకు సుమ సంతోషం వ్యక్తం చేశారు. 


'ఆస్కార్ వచ్చింది. సో, చెప్పండి! ఇంట్లో ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది?' అని సుమ కనకాల అడగ్గా... ''మనం చేసిన సినిమా జనాలకు ఎక్కువ రీచ్ అవ్వాలనే తాపత్రయమే ఉంటుంది తప్ప...రాజమౌళి గానీ, ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు గానీ అవార్డుల పట్ల ఎప్పుడూ అంత దృష్టి పెట్టలేదు'' అని కళ్యాణీ మాలిక్ సమాధానం ఇచ్చారు.


ఆస్కార్ వేడుక పూర్తి కావడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండియా వచ్చేశారు. నిన్న (బుధవారం) ఉదయమే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. అభిమానులు గ్రాండ్ వెల్కమ్ ఇవ్వడంతో పాటు రాజీవ్ గాంధీ ఇంటెర్నేషన్ ఎయిర్ పోర్ట్ అంతా 'జై ఎన్టీఆర్' నినాదాలతో హోరెత్తించారు. రేపు (శుక్రవారం) విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'దాస్ కా ధమ్కీ' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.


ఆస్కార్ నుంచి రామ్ చరణ్ నేరుగా ఢిల్లీలో ల్యాండ్ కానున్నారు. జాతీయ మీడియా సంస్థ నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడ నుంచి భాగ్య నగరానికి వస్తారు. ఆయనకు ఘన స్వాగతం పలకడానికి అభిమానులు భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.


Also Read : ఆస్కార్స్‌లో సత్తా చాటిన ఏసియన్లు - హాలీవుడ్ బడా దర్శకులకు చుక్కెదురు


దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అమెరికాలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడ లాస్ ఏంజిల్స్ సిటీలో రాజమౌళికి ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటిలో కొన్ని రోజులు ఉండొచ్చు. 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ రావడంతో ఇప్పుడు తదుపరి సినిమా మీద రాజమౌలోకి మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్టూడియోలు ఆ సినిమాకు పని చేసే అవకాశాలు ఉన్నాయి.


Also Read : ఆస్కార్ తెచ్చిన రాజమౌళి - దర్శక ధీరుడికి చరిత్ర సలామ్ కొట్టాల్సిందే