Oscars 2023 : ఆస్కార్స్‌లో సత్తా చాటిన ఏసియన్లు - హాలీవుడ్ బడా దర్శకులకు చుక్కెదురు
ఆస్కార్ అవార్డుల హంగామా ముగిసింది. ఈ వేడుకలో తెలుగు పాట 'నాటు నాటు...'కు అవార్డు రావడం మనకు గర్వకారణం. అయితే... ఈ వేడుకల్లో రికార్డులు ఏమిటి? రిక్త హస్తాలతో వెనుదిగిన భారీ చిత్రాలు ఏమిటి?
Continues below advertisement
ఆస్కార్స్ (Oscars 2023) విజేతలు ఎవరో తెలిసింది. ఈ ఏడాది... 95వ అకాడమీ అవార్డుల్లో ఆసియాకు చెందిన ప్రముఖులకు అవార్డులు వచ్చారు. మరీ ముఖ్యంగా మన తెలుగు పాట 'నాటు నాటు...'కు ఉత్తమ పాట విభాగంలో, ఇండియన్ డాక్యుమెంటరీ 'ది ఎలిఫెంట్ విష్పరర్స్'కు డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో అవార్డులు వచ్చాయి. అసలు, ఈ అవార్డుల్లో రికార్డులు ఏమిటి? రిక్త హస్తాలతో వెనుదిరిగిన భారీ చిత్రాలు ఏమిటి? అనేది ఒకసారి చూస్తే...
Continues below advertisement
- 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' సినిమాకు మిషెల్ యో (Michelle Yeoh) ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న తొలి (సౌత్ ఈస్ట్) ఆసియన్ మహిళగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు.
- 'మాన్‌స్టర్స్ బాల్' (2002) సినిమాకు హాలే బెర్రీ ఆస్కార్ అందుకున్నారు. ఆమె తర్వాత ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకున్న 'నాన్ వైట్ యాక్టర్'గా మిషెల్ యో నిలిచారు.
- 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్'లో నటించిన కి హుయ్ క్వాన్ (Ki Hui Kwan) ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు. ఈ పురస్కారం వరించిన తొలి వియత్నాం నటుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.
- ఆస్కార్ అవార్డు (Oscars 2023) అందుకున్న తొలి తెలుగు పాటగా 'నాటు నాటు...' (Naatu Naatu Won Oscar) చరిత్ర సృష్టించింది. 95 ఏళ్ళ ఆస్కార్ చరిత్రలో ఓ భారతీయ సినిమాకు అవార్డు రావడం కూడా ఇదే తొలిసారి.
- ఓ పాటకు గాను ఆస్కార్ అందుకున్న రెండో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఆయన కంటే ముందు 'జయ హో'కు ఏఆర్ రెహమాన్ అవార్డు అందుకున్నారు.
- ఆస్కార్ అందుకున్న తొలి తెలుగు లిరిసిస్ట్ చంద్రబోస్ (Chandrabose Lyricist). 'నాటు నాటు...' పాట రాసింది ఆయనే అని ప్రత్యేకంగా చెప్పాలా?
- డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో భారతీయ దర్శక నిర్మాతలు కార్తీకీ గొంజాల్వేస్, గునీత్ మోంగా తీసిన 'ది ఎలిఫెంట్ విష్పరర్స్' విజేతగా నిలిచింది.
- బెస్ట్ కాస్ట్యూమ్స్ విభాగంలో రెండుసార్లు ఆస్కార్ అందుకున్న ఏకైక నల్ల జాతీయురాలిగా రూత్ కార్టర్ రికార్డు క్రియేట్ చేశారు.
- 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' చిత్రానికి ఇద్దరు దర్శకులు డానియల్ క్వాన్, డానియల్ షైనెర్ట్ పని చేశారు. ఆస్కార్ చరిత్రలో దర్శక ద్వయం ఉత్తమ దర్శకులుగా నిలవడం ఇది మూడోసారి. ఇంతకు ముందు 'వెస్ట్ సైడ్ స్టోరీ' (1962)కి జెరోమీ రాబిన్స్, రాబర్ట్ వైజ్... 'నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్' (2008)కి జోయెల్, ఎథన్ కాయిన్ సోదరులు ఆస్కార్ అందుకున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్ కూడా ఈ ఏడాది ఆస్కార్స్ బరిలో ఉత్తమ దర్శకుడి విభాగంలో ఉన్నారు. ఆయన్ను దాటి డానియల్స్ విజేతలుగా నిలిచారు.
- ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' సినిమాకు (Everything Everywhere All At Once Movie) మొత్తం 11 నామినేషన్స్ లభించాయి. అందులో ఏడు విభాగాల్లో విజేతగా నిలిచింది. సినిమా, దర్శకుడు, నటి, సహాయ నటుడు, సహాయ నటి, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అవార్డులు కైవసం చేసుకుంది.
- 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' తర్వాత స్థానంలో 'ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్' (All Quiet On The Western Front Movie) సినిమా నిలిచింది. సినిమాటోగ్రఫీ, ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, ప్రొడక్షన్ డిజైన్, మ్యూజిక్ (ఒరిజినల్ స్క్రోర్) విభాగాల్లో విజేతగా నిలిచింది.
- స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వం వహించిన 'ది ఫేబుల్ మ్యాన్స్' సినిమా ఏడు విభాగాల్లో నామినేట్ అయ్యింది. ఆ సినిమాకు ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా రాలేదు. ఈ సినిమా స్పీల్ బర్గ్ సెమీ ఆటో బయోగ్రఫీ.
- హాలీవుడ్ టాప్ మూవీస్ 'టాప్ గన్ : మావెరిక్', 'అవతార్ : ద వే ఆఫ్ వాటర్', 'బ్లాక్ పాంథర్ : వాఖండ ఫరెవర్', 'విమెన్ టాకింగ్' సినిమాలు ఒక్కో అవార్డుతో సరిపెట్టుకున్నాను.
Also Read : ఆస్కార్ తెచ్చిన రాజమౌళి - దర్శక ధీరుడికి చరిత్ర సలామ్ కొట్టాల్సిందే
Continues below advertisement