‘RRR’ ఆనంద క్షణాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ‘నాటు నాటు’కు దక్కిన ఈ ఆస్కార్ అవార్డు టాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందుకే, యావత్ భారతదేశం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతోంది. అంతేకాదు, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ ప్రముఖులు వరకు ప్రతి ఒక్కరూ రాజమౌళీ అండ్ టీమ్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ తెలుగు పాట యావత్ దేశానికి గర్వకారణంగా నిలుస్తుందంటూ కొనియాడుతున్నారు. అంతర్జాతీయ వేదికపై మన సత్తాను చాటినందుకు సెల్యూట్ చేస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు ప్రతి ఒక్కరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాజమౌళి, కీరవాణిల టీమ్‌కు అభినందనలు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇంకా ఎవరెవరు ఏమన్నారో ఇక్కడ చూడండి.
పవన్ కళ్యాణ్: భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన ‘RRR’ మూవీ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి గారికి, గీత రచయిత చంద్రబోస్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ వార్తను చూడగానే ఎంతో సంతోషించాను. ఆస్కార్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచిన ‘RRR’ చిత్రంలో ‘నాటు నాటు...’ గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది. ఆ హుషారు ఈ రోజు ఆస్కార్ వేదిక మీద రెట్టించిన ఉత్సాహంతో కనిపించింది. ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతోపాటు అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరింది. ఇంతటి ఘనత పొందేలా ‘RRR’ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు శ్రీ ఎస్.ఎస్.రాజమౌళి గారికి ప్రత్యేక అభినందనలు. ఆ చిత్రంలో కథానాయక పాత్రల్లో ఒదిగిపోయిన శ్రీ ఎన్.టి.ఆర్, శ్రీ రాంచరణ్‌కు, గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కాలభైరవ, నృత్య దర్శకులు శ్రీ ప్రేమ్ రక్షిత్, చిత్ర నిర్మాత శ్రీ డి.వి.వి. దానయ్యలకు అభినందనలు. ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రానికి దక్కిన ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుతోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు స్ఫూర్తినిస్తుంది.
బాలకృష్ణ: ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని గెలుపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడం భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం. తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగిన విజయమిది. స్వరకర్త కీరవాణి గారికి, గీత రచయిత చంద్రబోస్ గారికి, ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అలాగే డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్ర బృందానికి నా అభినందనలు.
ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో.. నాటు నాటు పాటకి.. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న.. దర్శకుడు రాజమౌళి గారికి.. కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి.. రామ్ చరణ్ గారికి.. జూనియర్ N.T.R గారికి.. విజయేంద్ర ప్రసాద్ గారికి.. RRR టీమ్‌కి తెలుగు దర్శకుల సంఘం తరపన.. హృదయపూర్వక శుభాకాంక్షలు. - వై. కాశీ విశ్వనాధ్, ప్రెసిడెంట్, తెలుగు దర్శకుల సంఘం.
మహేష్ బాబు: ‘‘నాటు నాటు అన్ని హద్దులను దాటేసింది. ‘ఆస్కార్’ అవార్డుతో అసాధారణ విజయం సాధించిన కీరవాణి, చంద్రబోస్, ఆర్ఆర్ఆర్ టీమ్‌కు అభినందనలు. భారతీయ సినిమాకు ఇది సంతోషకరమైన క్షణం’’.
రజినీకాంత్: ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు అందుకున్నం కీరవాణి, రాజమౌళి గారికి, కార్తికీ గోన్సాల్వేస్ (ఎలిఫాంట్ విష్పర్స్)కు నా హృదయపూర్వక అభినందనలు. సెల్యూట్ టు ద ప్రౌడ్ ఇండియన్స్.