బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కింది. దీపికా పదుకొనె ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 2న విడుదలైప ఈ సినిమా రికార్డ్ స్థాయి కలెక్షన్లను అందుకుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లను సాధించడమే కాకుండా అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా రికార్డు సృష్టించింది. షారుఖ్ ఖాన్ కు సౌత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషాల్లో ఒకేసారి విడుదల చేశారు. ఇక్కడ కూడా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ. దీంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు షారుఖ్ ఫ్యాన్స్. గత కొన్ని రోజులుగా దీనిపై వార్తలు వస్తున్నాయి. అయితే ‘పఠాన్’ ఓటీటీ విడుదలపై అమెజాన్ ప్రైమ్ ఓ కొత్త అప్డేట్ ను అందించింది. 


‘పఠాన్’ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు అంటూ ప్రకటించిందీ సంస్థ. అయితే విడుదల తేదీను మాత్రం ప్రకటించిలేదు. ఫిల్మ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమాను ఏప్రిల్ 26 నుంచి ఓటీటీ లో చూడొచ్చు అనే వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై త్వరలో అమెజాన్ ప్రైమ్ ఓ ప్రత్యేకమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా కొత్త ఎడిటింగ్ వెర్షన్ ను ఓటీటీలో విడుదల చేస్తామని దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రకటించడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై అంచనాలు పెరుగుతున్నాయి. 


ఇక షారుఖ్ అభిమానులు ఒక పవర్ ఫుల్ మూవీ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. గత నాలుగేళ్లుగా షారుఖ్ నుంచి సరైన సినిమా రాలేదు. మధ్యలో గెస్ట్ రోల్స్ లలో కనిపించినా అది ఫ్యాన్స్ కు కిక్ ఇవ్వలేదు. ఒకప్పుడు కింగ్ ఖాన్ గా పేరు తెచ్చుకుని బాలీవుడ్ కలెక్షన్లను శాసించిన షారుఖ్ ఒక హిట్ కోసం ఎదురుచూడాల్సి రావడంతో ఆయన సినిమా కెరీర్ పై విమర్శలు మొదలైయ్యాయి. అయితే నాలుగేళ్ల నిరీక్షణను ‘పఠాన్’ సినిమా విజయంతో భర్తీ చేసేశారు షారుఖ్. అంతగా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. 


‘పఠాన్’ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పటి నుంచే ఈ సినిమాపై వ్యతిరేకత మొదలైంది. తర్వాత మూవీలో ‘భేషరమ్ రంగ్’ సాంగ్ విడుదల అయ్యాక పెద్ద దుమారమే చెలరేగింది. ఈ పాటలో హీరోయిన్ దీపికా పదుకోణ్ ధరించిన కాషాయ రంగు వస్త్రాలపై విమర్శలు వచ్చాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ పాటలో సన్నివేశాలు ఉన్నాయని పలు హిందూ సంఘాలు ఆరోపించాయి. ఈ మూవీను బ్యాన్ చేయాలంటూ నిరసనలు కూడా చేశారు. అయితే వాటన్నిటినీ తట్టుకొని మూవీ థియేటర్లకు వచ్చింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ మూవీ రిలీజ్ కు ముందే 5.21 లక్షల అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ సినిమా ఒక్క హిందీలోనే రూ.519.50 కోట్ల నికర, అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ.1041.25 కోట్ల వసూళ్లు సాధించి భారీ విజయాన్ని సాధించింది.