సీనియర్ హీరోయిన్, ఇప్పుడు సినిమాల్లో అమ్మ, అత్త పాత్రలు చేస్తున్న సంగీత (Sangeetha) ఓ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'మసూద' (Masooda Movie). ఇందులో తిరువీర్ (Thiruveer) హీరో. ఆయన 'జార్జ్ రెడ్డి'లో లలన్ సింగ్ పాత్రలో నటించారు. 'ఆహా' వెబ్ సిరీస్ 'సిన్'లో హీరోగా చేశారు. ఆయన జోడీగా కావ్యా కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram) నటించారు. కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిది. ఇంతకు ముందు 'గంగోత్రి'లో బాల నటిగా కనిపించిన అమ్మాయి ఈ అమ్మాయే.


హారర్ డ్రామాగా 'మసూద' రూపొందింది. 'మ‌ళ్లీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ' వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థలో రూపొందుతోన్న మూడో చిత్రమిది. రాహుల్ యాదవ్ నక్కా (Rahul Yadav Nakka) నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నవంబర్ 11న విడుదల చేయనున్నట్లు ఈ రోజు వెల్లడించారు. 


మూడు భాషల్లో 'మసూద'
''మంచి హారర్ డ్రామా చూసి చాలా కాలమైంది. తెలుగుతో పాటు హిందీ, త‌మిళంలో కూడా ఒకేసారి విడుద‌ల చేయ‌డానికి  ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. మంచి హారర్ డ్రామాల్లో ఇదీ ఒకటిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది. నవంబర్ 11న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని రాహుల్ యాదవ్ నక్కా తెలిపారు. 



Masooda Teaser Review : 'మసూద' టీజర్ చూస్తే... ఇదొక హారర్ డ్రామా సినిమా అనే విషయం అర్థం అవుతోంది. 'టాబ్లెట్స్‌తో తనకు నయం అవుతుందని నాకు అనిపించడం లేదు గోపీ! అప్పుడప్పుడూ తాను చేసేది చూస్తే ఎవరైనా పీర్ బాబాకు చూపిస్తే మంచిదేమో! ఏమంటావ్' అని సంగీత చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. 'ఏమో అండీ. నాకు అస్సలు ఐడియా లేదు' అని తిరువీర్ చెబుతారు. ఆ తర్వాత స్క్రీన్ మీద చాలా విజువల్స్ కనిపిస్తాయి. కథేంటి? అనేది క్లారిటీగా చెప్పలేదు. కానీ, ముస్లిం ఫ్యామిలీ నేపథ్యంలో సినిమా తెరకెక్కించినట్టు అర్థం అవుతోంది.


మతం, మూఢ నమ్మకాలు, సైన్స్ నేపథ్యంలో సినిమా రూపొందించారు. ఇందులో గోపిగా తిరువీర్ నటించారు. సైన్స్ టీచర్ పాత్రలో సంగీత నటించారు.  శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్ తదితరులనూ చూపించారు. తిరువీర్ దేని కోసమో వెతకడం, ఆయన్ను ఎవరో కత్తితో పొడిచినట్టు చూపించడం... మొత్తం మీద సినిమాపై ఈ టీజర్ ఆసక్తి కలిగించింది.


Also Read : 'పొన్నియిన్ సెల్వన్' రివ్యూ : 'బాహుబలి' చూసిన కళ్ళకు నచ్చుతుందా? లేదా?


'మళ్ళీ రావా'తో గౌతమ్ తిన్ననూరిని, 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'తో స్వరూప్ ఆర్ఎస్‌జేను దర్శకులుగా పరిచయం చేసిన రాహుల్ యాదవ్ నక్కా.. . ఈ సినిమాతో సాయికిరణ్ అనే యువకుడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. అఖిల రామ్, బాంధవి శ్రీధర్, 'సత్యం' రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు. టీజర్ లో ఆయన నేపథ్య సంగీతం బావుంది.  


Also Read : విల్లు ఎక్కుపెట్టిన శ్రీరామునిగా ప్రభాస్ వచ్చాడు - అభిమానులకు పండగ షురూ