ప్రభు రామ్... వెండితెరపై శ్రీరాముని పాత్రలో ప్రభాస్ (Prabhas) కనిపించనున్న సినిమా 'ఆదిపురుష్' (Adipurush Movie). విజయ దశమి సందర్భంగా అక్టోబర్ 2న, అయోధ్యలో సినిమా టీజర్ (Adipurush Teaser) విడుదల చేయనున్నారు. ఈ విషయం తెలిసిందే. టీజర్ కంటే ముందు యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు చిత్ర బృందం ఓ కానుక ఇచ్చింది. ఈ రోజు 'ఆదిపురుష్' టీజర్ పోస్టర్ విడుదల చేసింది.


అయోధ్యలో సరయు నదీ తీరంలో సాయంత్రం 7.11 గంటలకు 'ఆదిపురుష్' టీజర్ విడుదల చేయనున్నట్లు దర్శకుడు ఓం రౌత్ తెలిపారు. ఈ ప్రయాణంలో తమతో జాయిన్ కావాల్సిందిగా ప్రేక్షకులను ఆయన కోరారు. విల్లు ఎక్కుపెట్టిన శ్రీరామునిగా ప్రభాస్ పోస్టర్ విడుదల చేసిన ఆయన, AdipurushInAyodhya హ్యాష్ ట్యాగ్ జోడించారు.  






సంక్రాంతి కానుకగా... వచ్చే ఏడాది జనవరి 12న (Adipurush Release Date) ప్రపంచవ్యాప్తంగా  త్రీడీలో 'ఆదిపురుష్' విడుదల కానుంది. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. 'ఆదిపురుష్'కు ముందు, 'ఆదిపురుష్' తర్వాత అనేలా... జనవరి 12న దేశవ్యాప్తంగా శ్రీరామ నామ జపం వినిపించేలా సినిమాను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వినికిడి. 


'ఆదిపురుష్' టీజర్ విడుదల కార్యక్రమానికి ఉత్తరపదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరు కానున్నారని హిందీ చిత్రసీమ వర్గాల కథనం. అయితే, ఇటు చిత్ర బృందం గానీ... అటు యోగి సన్నిహితులు గానీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. శ్రీరాముని జన్మభూమి అయోధ్యలో టీజర్ విడుదల చేయాలనుకోవడంతో అందులో ఏం చూపిస్తారోననే ఆసక్తి అందరిలో నెలకొంది. 


వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసేలా...
తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... హిందీ ప్రేక్షకులలో ప్రభాస్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకు తగ్గట్టు దేశంలో వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో 'ఆదిపురుష్' షోలు వేసేలా ప్లాన్ చేస్తున్నారట.


ఇండియా మొత్తం మీద సుమారు 9,500 స్క్రీన్లు ఉన్నాయని చెప్పాలి. అందులో ఆరున్నర వేల స్క్రీన్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్లు! మిగతావి మల్టీప్లెక్స్‌లు. వాటిలో సుమారు ఎనిమిది వేల స్క్రీన్‌ల‌లో 'ఆదిపురుష్' విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. 
'ఆదిపురుష్' రిలీజ్ డే (జనవరి 12న) 35,000 కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ ఇన్‌సైడ్‌ టాక్. 


Also Read : కృష్ణంరాజు సంస్మ‌ర‌ణ స‌భ‌ - భోజనాల కోసం రూ.4 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభాస్!


ఓపెనింగ్స్ విషయంలో ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ సాదిస్తుందని, ఫస్ట్ డే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాల అంచనా. తొలుత ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. అయితే, కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన 'లాల్ సింగ్ చడ్డా'ను ఆ రోజు విడుదల చేయాలని భావించడంతో... ఆమిర్ ఖాన్ సినిమా కోసం ప్రభాస్ రిలీజ్ డేట్ త్యాగం చేశారు. 


'ఆదిపురుష్'ను టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. హిందీలో 'తానాజీ' వంటి హిట్ సినిమా తీసిన ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు. 


Also Read : కాషాయ జెండా కడుతున్న బాలీవుడ్ - సక్సెస్ కోసం హిందుత్వ సిద్ధాంతాన్నే నమ్ముకుంటోందా?