సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన తొలి రోజుల్లో చాలా మంది నటీనటులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అవకాశాలు రాక, డబ్బులు లేక చాలా అవస్థలు పడినవారిని ఎంతో మందిని చూశాం. బాధలు తట్టుకుని నిలబడ్డ చాలా మంది ఇప్పుడు అద్భుత నటులుగా రాణిస్తున్నారు. లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు. అలాంటి నటుల్లో ఒకరు మనోజ్ బాజ్‌పేయ్. అప్పట్లో డబ్బులు లేక ఎంత కష్టపడ్డారో ఆయన వివరించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన కెరీర్ గురించి చెప్పుకొచ్చారు. 


డబ్బు కోసం మనోజ్ కష్టాలు


చాలా మంది నటుల మాదిరిగానే మనోజ్ బాజ్‌పేయ్ కూడా ఆర్జీవీ సినిమాల్లో కనిపించి అద్భుత నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో రామ్ గోపాల్ వర్మతో చేసిన సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.  రామ్ గోపాల్ వర్మ ‘దౌడ్’ చిత్రంలో ఓ క్యారెక్టర్ కోసం ఆయన కార్యాలయానికి వెళ్లారు. కానీ, తను ‘సత్య’ సినిమాలో కీలక పాత్ర ఇస్తానని, ఈ సినిమా గురించి మర్చిపోవాలని చెప్పారట.  కానీ, డబ్బులు చాలా అవసరం కావడంతో చిన్న పాత్ర అయినా చేస్తానని వర్మను బతిమాలినట్లు చెప్పారు.  


ఆ మాట చెప్పగానే లేచి నిలబడ్డ ఆర్జీవీ


ఆర్జీవీని కలవగానే “ఇంతకు ముందు ఎక్కడైనా నటించావా?” అని అడిగారట. “అవును, బాండిట్ క్వీన్ చేశాను. కానీ మీరు నన్ను గుర్తించరు. ఎందుకంటే నేను అందులో డైలాగ్స్ లేని క్యారెక్టర్ నాది. మాన్ సింగ్‌ గా నటించాను” అని చెప్పారట. వెంటనే ఆర్జీవీ లేచి నిలబడి “నీ కోసం చాలా సంవత్సరాలు వెతుకుతున్నానని.. కానీ, నువ్వు నాకు ఎదురు పడలేదు. ఒక పని చేయి. ‘దౌడ్‌’ను మరచిపో. నీ కోసం నా దగ్గర మరో సినిమా ఉంది. అందులో లీడ్ క్యారెక్టర్ నీదే” అని చెప్పారట. “కానీ, డబ్బుల అవసరం చాలా ఉంది. కనీసం ఇంటి అద్దె చెల్లించలేని స్థితిలో ఉన్నాను. ‘సర్, వో జబ్ హోగా తో హోగా, ముఝే యే కర్నే దీజియే, ముఝే పైసే కి జరూరత్ హై” (అది అప్పుడు చూసుకుందాం. నన్ను ఈ సినిమాలో తీసుకోండి. నాకు డబ్బులు చాలా అవసరం) అని చెప్పారట. కచ్చితంగా సత్యాలో లీడ్ క్యారెక్టర్ ఇస్తానని చెప్పినా, ఈ సినిమాలోని ఓ క్యారెక్టర్ కోసం పట్టుబట్టినట్లు వివరించారు.   


దౌడ్’తో వచ్చిన డబ్బుతో ఏం చేశానంటే?


అనుకున్నట్లుగానే ‘దౌడ్’ సినిమాలో ఓ క్యారెక్టర్ చేసినట్లు చెప్పారు మనోజ్. ఇందులో నటనకు గాను అప్పట్లో రూ.30 వేల పారితోషకం లభించినట్లు వివరించారు. ఆ డబ్బుతో ఏడాది అద్దె చెల్లించినట్లు చెప్పారు. మిగతా అవసరాల కోసం ఉపయోగించుకున్నట్లు వివరించారు. ‘సత్య’ సినిమాలోనూ మంచి రోల్ చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత మనోజ్ ఏ స్థాయికి ఎదిగారో మీకు తెలిసిందే. వరుస అవకాశాలతో టాప్ యాక్టర్ గా ఎదిగారు. ప్రస్తుతం దేశంలో అత్యంత ప్రేక్షకాధరణ పొందుతున్న నటుల్లో ఒకరుగా మనోజ్ కొనసాగుతున్నారు. హిట్ ప్రైమ్ వీడియో సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’తో ఆయన రేంజ్ మరింత పెరిగింది. త్వరలో ఆయన ‘ది ఫ్యామిలీ మ్యాన్-3’ సీజన్‌తో వచ్చేస్తున్నారు. 


Read Also: నిన్న గోల్డెన్ గ్లోబ్, నేడు క్రిటిక్స్ ఛాయిస్ - అంతర్జాతీయ అవార్డుల వేదికపై సత్తా చాటుతున్న ‘RRR’