పోలీసు ఆత్మహత్య చేసుకున్నాడంటే కచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. అందులోనూ ఇద్దరు పోలీసులు.. ఒకరు కానిస్టేబుల్, ఇంకొకరు ఎస్ఐ.. 24గంటల వ్యవధిలో ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకరు తుపాకీతో కాల్చుకున్నారు, ఇంకొకరు చెట్టుకు ఉరేసుకున్నారు. ఇద్దరూ ఒకే పోలీస్ దళంలో పనిచేస్తున్నారు. అందులోనూ శ్రీహరి కోట వంటి కీలక స్థావరంలో వారు గస్తీ కాస్తున్నారు. అలాంటి ఇద్దరూ ఒకేరోజు చనిపోవడం మిస్టరీగా మారింది.




శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) గస్తీ విధులు నిర్వహిస్తుంది. సీఐఎస్ఎఫ్ స్టార్ ఇక్కడే క్వార్టర్స్ లో నివశిస్తుంటారు. స్థానిక పోలీసులతోపాటు వీరు కూడా విధుల్లో పాల్గొంటారు. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చినవారు కూడా సీఐఎస్ఎఫ్ లో పనిచేస్తుంటారు. అలా వచ్చినవారిలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చింతామణి ఒకరు. చింతామణి వయసు 29 ఏళ్లు. ఈనెల 10న శ్రీహరికోటలో కానిస్టేబుల్ గా విధుల్లో చేరారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని మహషముండ్ జిల్లా అతనిది. శ్రీహరికోటలోని అటవీప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు చింతామణి. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


చింతామణి ఆత్మహత్య సమాచారం అందుకున్న సీఐ­ఎస్‌ఎఫ్‌ ఇన్‌ స్పెక్టర్‌ చిన్నకన్నన్‌ శ్రీహరికోట సివిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ మనోజ్‌కుమార్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.


2021లో చింతామణి సీఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్‌ గా ఎంపికయ్యారు. శిక్షణ తర్వాత శ్రీహరికోటలోని యూనిట్‌ లో అతనికి పోస్టింగ్ వచ్చింది. ఇటీవల నెలరోజుల పాటు లాంగ్ లీవ్ పై సొంతూరు వెళ్లి వచ్చాడు చింతామణి. తిరిగి వచ్చిన తర్వాత ఈ నెల 10న విధుల్లో చేరారు. షార్‌ లోని పీసీఎంసీ రాడార్‌-1 ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం సెకండ్ షిఫ్ట్ డ్యూటీకి హాజరయ్యారు చింతామణి. రాత్రి 7.30 గంటలకు కూడా అతను యాక్టివ్ గానే ఉన్నారు. సెట్‌ లో కంట్రోల్‌ రూమ్‌ తో మాట్లాడి ఎలాంటి అనుమానిత ఘటనలు లేవని సమాచారమిచ్చారు. ఆ తర్వాత అత్యవసర భద్రత దళానికి చెందిన పోలీసులు అటువైపు పెట్రోలింగ్ కి వెళ్లారు. వారికి చెట్టుకు వేలాడుతున్న చింతామణి మృతదేహం కనిపించింది. కుటుంబ సమస్యలతోనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


రివాల్వర్ తో కాల్చుకుని ఎస్ఐ మృతి..


బీహార్ కి చెందిన వికాస్ సింగ్ సీఐఎస్‌ఎఫ్‌ విభాగంలో సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ గా పనిచేస్తున్నారు. అతని వయసు 33 ఏళ్లు. సోమవారం రాత్రి తన తుపాకీతో కాల్చుకుని వికాస్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్‌ కు చెందిన వికాస్‌ సింగ్‌ సెలవు కావాలని కొద్దిరోజులుగా అడుగుతున్నారు. దానికి ఉన్నతాధికారుల నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో అతను ఆత్మహత్యకు పాల్పడి ఉంటారన చెబుతున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.


ప్రస్తుతానికి ఈ రెండు ఆత్మహత్యల వెనక కామన్ రీజన్ ఏదీ లేదని అంటున్నారు పోలీసులు. ఒకరిది వ్యక్తిగత కారణం అయితే, ఇంకొకరు సెలవలు ఇవ్వలేదన్న కారణంతో తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్టు చెబుతున్నారు.