Tech Layoffs: టెక్నాలజీ రంగానికి ఇది బాగా గడ్డుకాలం. ఆర్థిక మాంద్యం కారుమేఘాలు కమ్ముకొస్తుండడంతో.. ముందు జాగ్రత్తగా కొన్ని నెలల నుంచీ టెక్‌ కంపెనీలు తమ ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌ ఇస్తున్నాయి. కొత్త నియామకాల్లోనూ వేగం బాగా తగ్గించాయి.


2023 జనవరిలో ఇప్పటి వరకు చూస్తే... భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 1,600 మందికి పైగా టెక్ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. లేఆఫ్స్ ట్రాకింగ్ సైట్ "Layoffs.fyi" నుంచి వచ్చిన డేటా ప్రకారం, 2022లో, 1,000 కంపెనీలు 1,54,336 మంది సిబ్బందిని శాశ్వతంగా ఇళ్లకు పంపేశాయి.


టాప్‌ ప్లేస్‌లో ఇండియన్‌ కంపెనీలు
2022లో కనిపించిన భారీ టెక్‌ లేఆఫ్స్‌ కొత్త సంవత్సరంలోనూ కొనసాగుతున్నాయి. భారతీయ కంపెనీలు & స్టార్టప్‌లు తమ సిబ్బందిని తొలగించడంలో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాయి.


స్వదేశీ సోషల్‌ మీడియా కంపెనీ 'షేర్‌చాట్' (ShareChat - (Mohalla Tech Pvt Ltd), అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగా 20 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఇది, 500 మందికి పైగా ఉద్యోగుల జీవితాలను ప్రభావితం చేసింది.


డిసెంబర్ 2022లో, తన Jeet11 ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్‌ను మూసేసిన ShareChat, దాని ఉద్యోగులలో దాదాపు 5 శాతం మందిని తీసేసింది.


ఓలా (Ola - ఇది 200 మంది ఉద్యోగులను తొలగించింది), వాయిస్ ఆటోమేటెడ్ స్టార్టప్ Skit.ai వంటి కంపెనీలు కూడా ఈ నెలలో ఉద్యోగులను తొలగించి వార్తల్లో ప్రముఖంగా నిలిచాయి.


స్వదేశీ క్విక్‌ గ్రోసరీ డెలివరీ ప్రొవైడర్ డంజో (Dunzo) కూడా ఖర్చు తగ్గింపు చర్యలకు దిగి, తన వర్క్‌ఫోర్స్‌లో 3 శాతం మందికి ఉద్వాసన పలికింది.


2023 సంవత్సరం ప్రారంభం నుంచీ ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్కర్లను లేఆఫ్‌ పీడకలలు వెంటాడుతున్నాయి. జనవరి నెల మొదటి 15 రోజుల్లోనే ఇప్పటి వరకు 91 కంపెనీలు 24,000కు పైగా టెక్ ఉద్యోగాల్లో కోతలు పెట్టాయి. రాబోయే రోజులు మరింత అధ్వాన్నంగా ఉండవచ్చన్న దానికి ఇది ఒక సూచన.


భారతదేశంలో దాదాపు 1,000 మంది సిబ్బంది సహా ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అమెజాన్ (Amazon) ప్రకటించింది.


లింక్డ్‌ఇన్‌ది భిన్న వైఖరి
ఈ కంపెనీలు అన్నింటికీ విరుద్ధంగా లింక్డ్‌ఇన్ (LinkedIn) ప్రవర్తిస్తోంది. ఈ కంపెనీ కొత్త ఉద్యోగుల వేటలో ఉంది. ఇతర కంపెనీల నుంచి ఉద్వాసనకు గురైన వాళ్లకు రెడ్‌ కార్పెట్‌ వేసి ఆహ్వానం పలుకుతోంది. అనిశ్చిత ఆర్థిక వాతావరణం కారణంగా అనేక కంపెనీలు వాటి శ్రామిక శక్తిని తగ్గిస్తుంటే, మెడ మీద కత్తి వేలాడుతున్న ఉద్యోగులకు కెరీర్ సలహాలు కూడా ఇస్తోంది. ఉద్యోగ జీవితంలో ఎదరయ్యే ఇలాంటి అడ్డంకులను ఎలా ఎదుర్కోవాలి అన్న అంశాలను లింక్డ్‌ఇన్‌ సూచిస్తోంది.


మార్కెట్ పరిశోధన సంస్థ సెన్సార్ టవర్ (Sensor Tower) రిపోర్ట్‌ ప్రకారం.. 2022లో లింక్డ్‌ఇన్ యాప్ ప్రపంచవ్యాప్తంగా 58.4 మిలియన్ల డౌన్‌లోడ్స్‌ను సాధించింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల ద్వారా ఈ డౌన్‌లోడ్స్‌ జరిగాయి. 2021 సంవత్సరంలో డౌన్‌లోడ్స్‌తో పోలిస్తే, 2022లో ఈ యాప్‌ డౌన్‌లోడ్స్‌ 10 శాతం పెరిగాయి.