కప్పుడు దక్షిణాది సినిమాలు, నటీనటులంటే చిన్న చూపు ఉండేది. అయితే, ఇప్పుడు రోజులు మారాయి. దేశాన్నే కాదు.. యావత్ ప్రపంచాన్నే మన వైపు తిప్పుకొనే స్థాయిలో దక్షిణాది సినిమాలు తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ మూవీకి ఎంత క్రేజ్ లభిస్తుందో తెలిసిందే. కేవలం దక్షిణాది సినిమాలకే కాదు.. హీరోలకు కూడా మంచి గుర్తింపు లభిస్తోంది. అయితే, కేవలం పాన్ ఇండియా హీరోలకు మాత్రమే ఎక్కువ అభిమానులు ఉన్నారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ (IIHB) జరిపిన రీసెర్చ్ సర్వేలో హీరో సూర్య దక్షిణాదిలోనే టాప్-1 స్థానాన్ని కైవశం చేసుకున్నారు. అల్లు అర్జున్, ‘వారసుడు’ హీరో విజయ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. మొత్తం 18 మంది దక్షిణాది హీరోలపై నిర్వహించిన స్టడీలో.. హీరో సూర్య దాదాపు అన్ని విభాగాల్లో మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. 


దక్షిణాదిలో నమ్మదగిన హీరోలు ఎవరనే ప్రశ్నకు ఎక్కువ మంది సూర్యకే ఓటేశారు. తెలుగులో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండకు, తమిళంలో సూర్య తర్వాత విజయ్, శివ కార్తికేయన్ ఉన్నారు. మలయాళంలో ఫహాద్ ఫసిల్, కన్నడలో కిచ్చా సుదీప్‌లు ఆ అంశంలో టాప్‌లో ఉన్నారు. అలాగే మోస్ట్ ఐడెంటిఫైడ్ స్టార్‌ విభాగంలో కూడా సూర్యనే టాప్‌లో ఉన్నాడు. సూర్య తర్వాతి స్థానంలో ప్రభాస్, రామ్ చరణ్, తమిళంలో విజయ్, విజయ్ సేతుపతి ఉన్నారు. కన్నడలో యశ్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమార్ ఉన్నారు. 


దక్షిణాదిలో మోస్ట్ అట్రాక్టీవ్ స్టార్స్‌లో కూడా సూర్య మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన తర్వాత అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఉన్నారు. దక్షిణాదిలో రెస్పెక్టెడ్ స్టార్‌ అంశంలో కూడా సూర్యనే టాప్‌లో ఉన్నారు. తెలుగులో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. తమిళంలో అజీత్, శివకార్తికేయన్ టాప్‌లో ఉన్నారు. చిత్రం ఏమిటంటే మలయాళం, కన్నడలో యశ్ మొదటి స్థానంలో ఉన్నాడు. కన్నడలో కిచ్చ సుదీప్ రెండో స్థానంలో ఉన్నాడు. 


దక్షిణాది రాష్ట్రాల్లో ఏ హీరోను ప్రజలు ఎక్కువ అభిమానిస్తున్నారనే అంశంపై ట్రస్ట్ ఐడెంటిఫై అట్రాక్టీవ్, రెస్పెక్ట్, అప్పీల్(TIARA) పేరుతో IIHB రీసెర్చ్ చేసింది. ఈ సందర్భంగా ఆ సెలబ్రిటీ వ్యక్తిత్వం, సేవలు ఇలా 64 అంశాలపై ప్రేక్షకుల అభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా తమిళంలో ఆరుగురు, తెలుగులో ఆరుగురు, మలయాళంలో నలుగురు, కన్నడలో ఇద్దరు సెలబ్రిటీల గురించి తెలుసుకున్నారు. గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ స్టడీ నిర్వహించారు. మొత్తం నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో 5,246 మందిని వివిధ అంశాలపై ప్రశ్నించారు. 


Read Also: నిన్న గోల్డెన్ గ్లోబ్, నేడు క్రిటిక్స్ ఛాయిస్ - అంతర్జాతీయ అవార్డుల వేదికపై సత్తా చాటుతున్న ‘RRR’


తాజాగా విడుదలైన TIARA సౌత్ రీసెర్చ్ రిపోర్ట్-2023 ప్రకారం.. దక్షిణాదిలో దాదాపు అన్ని అంశాల్లో టాప్-1 స్థానంలో హీరో సూర్య నిలిచాడు. ఇక రాష్టాలవారీగా చూస్తే.. తెలుగులో అల్లు అర్జున్, మలయాళంలో దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫసిల్, తమిళంలో సూర్య నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. అయితే, అంశాలను బట్టి వీరి స్థానాలు మారాయి. కేవలం సూర్య మాత్రమే అన్ని స్థానాల్లో టాప్‌లో నిలిచి దక్షిణాదిలోనే ప్రేక్షకులు మెచ్చిన హీరోగా టాప్‌లో నిలవడం విశేషం.