దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా అంతర్జాతీయ అవార్డులను కొల్లగొడుతోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ఈ సినిమా, తాజా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల వేడుకల్లోనూ దుమ్మురేపింది. రెండు కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుని అదుర్స్ అనిపించింది.
ప్రతిష్టాత్మక అవార్డులను కొల్లగొడుతున్న ‘RRR’
ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమా సత్తా ఏంటో నిరూపించింది ‘RRR’ మూవీ. ఏకంగా రూ.1200 కోట్లు వసూళ్లతో అతి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా అవతరించింది. జపాన్ తో పాటు అమెరికాలోనూ ఈ సినిమా సత్తా చాటింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటనా సామర్ధ్యానికి మచ్చుతునకగా నిలిచింది. కలెక్షన్లలో తిరుగులేదని నిరూపించిన ఈ చిత్రం ప్రతిష్టాత్మక అవార్డులను సైతం కొల్లగొడుతోంది.
రెండు విభాగాల్లో ‘RRR’కు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు
ఇటీవలే ‘RRR’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుంది. అదే ఊపులో ఈసారి బెస్ట్ మ్యూజిక్ కేటగిరీతో పాటు, బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ కేటగిరీల్లో ‘లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు’లను దక్కించకుంది. ‘RRR’ ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో ఐదు విభాగాల్లో నామినేట్ అయింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ సాంగ్ కేటగిరీల్లో చోటు సంపాదించుకుంది. ఐదు కేటగిరీల్లో నామినేట్ అయిన ఇండియన్ సినిమాగా ఈ చిత్రం రికార్డు సాధించింది.
అవార్డులు అందుకున్న రాజమౌళి, కీరవాణి
బెస్ట్ మ్యూజిక్ విభాగానికి సంబంధించిన అవార్డును ఈ సినిమా సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి అందుకున్నారు. బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ మూవీ కేటగిరీకి సంబంధించిన అవార్డును దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన కుమారుడు కార్తికేయతో కలిసి స్టేజ్ మీదకు వెళ్లి తీసుకున్నారు. ఈ అవార్డులు తీసుకుంటున్న ఫోటోలను ‘RRR’ టీమ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో నెటిజన్లు రాజమౌళి, కీరవాణి, సినిమా యూనిట్ ను అభినందిస్తున్నారు. ఇదే జోష్ లో ఆస్కార్ అవార్డు కూడా దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఆస్కార్ పైనే అందరి దృష్టి!
ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్న ఈ సినిమా, ఆస్కార్ అవార్డుల కోసం ఎదురుచూస్తోంది. ఈ సినిమా ఆస్కార్ అవార్డుల్లో ఏకంగా 10 కేటగిరీల్లో షార్ట్ లిస్ట్ చేయబడింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా ఈ పాట ఆస్కార్ అవార్డును అందుకుంటుందని అందరూ భావిస్తున్నారు. అటు ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలోనూ అవార్డును దక్కించుకునే అవకాశం ఉందంటున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ హీరోలుగా ‘RRR’ మూవీ తెరకెక్కింది. ఈ ప్రతిష్టాత్మక సినిమాను డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఆలియా భట్, ఒలీవియా కీలక పాత్రల్లో నటించారు.