దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఓ రేంజ్ లో చేస్తున్నారు. కపిల్ శర్మ కామెడీ షో, హిందీ బిగ్ బాస్ ఇలా దేన్నీ వదలకుండా సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ సినిమాలో మూడు పాటలను విడుదల చేశారు. అందులో 'నాటు నాటు' పాటలో హీరోలు వేసిన స్టెప్పులకు క్రేజీ రెస్పాన్స్ లభించింది. 'జనని...' సాంగ్ సినిమాలో ఎమోషన్ ని, 'దోస్తీ' సాంగ్ హీరోల మధ్య స్నేహాన్ని ఎలివేట్ చేసింది.
తాజాగా సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు. కీరవాణి తనయుడు యువ సంగీత దర్శకుడు కాలభైరవ పాడిన 'కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో .. మండాలి కొడుకో..' అంటూ సాగే ఈ పాటను చిత్రబృందం విడుదల చేసింది. 'రివోల్ట్ ఆఫ్ భీమ్' పేరుతో పాటను విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ అభిమానులకు ఇదొక స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి.
'భీమా నినుగన్న నేలతల్లి.. ఊపిరిపోసిన సెట్టుసేమా.. పేరుబెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా.. ఇనబడుతుందా..?' అనే డైలాగ్ తో ఈ సాంగ్ మొదలైంది. సినిమాలో కొమరం భీమ్ పాత్రను ఉద్దేశించి సాగే ఈ పాటకు ప్రముఖ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా.. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సినిమాలో కీలక భావోద్వేగభరిత సన్నివేశాలను ఎలివేట్ చేసే సందర్భంగా ఈ పాట వస్తుందని చెబుతున్నారు. ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. శ్రియా శరన్, అజయ్‌దేవ్‌గణ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.