కాశీనాథుని విశ్వనాథ్ (K Viswanath) భౌతికంగా ప్రేక్షకులకు దూరమైనా... ఎప్పటికీ సినిమాలతో, సాహిత్యంతో దగ్గరగా ఉంటారు. ఒకటా? రెండా? ఎన్నో గొప్ప కళాత్మక చిత్రాలకు ప్రేక్షకులకు అందించి వెళ్ళారు కళా తపస్వి. సమాజానికి అవసరమైన, సరైన దిశలో దిశానిర్దేశం చేసే సినిమాలు తీశారు. అటువంటి దిగ్గజ దర్శకుడికి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సరైన గౌరవం ఇవ్వలేదా? ఆ స్థాయిని ఒక విధంగా అవమానించారా? ఈ విషయంలో పెద్ద చర్చ జరుగుతోంది. 


ప్రభుత్వ లాంఛనాలు ఎక్కడ?
ప్రముఖులు ఎవరైనా మరణించినప్పుడు అధికార లాంఛనాలతో ప్రభుత్వాలు అంత్యక్రియలు నిర్వహించడం రివాజుగా వస్తోంది. చిత్రసీమలో కొందరికి ఆ విధంగా జరిగింది. ఎవరెవరికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు? అనేది ఇక్కడ అప్రస్తుతం. కాశీనాథుని విశ్వనాథునికి మాత్రం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదనేది వాస్తవం. ఆ విషయం చర్చనీయాంశం అవుతోంది. 


విశ్వనాథ్ పరిచయం చేసిన గేయ రచయిత 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి మరణం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు ఆయన్ను గౌరవించాయి. అందుకు అందరూ సంతోషించారు. 'సిరివెన్నెల'కు చిత్రసీమలో ఒక విధంగా గురువు లాంటి వ్యక్తి, ఆయనతో గొప్ప పాటలు రాయించిన, ఇంకెన్నో గొప్ప చిత్రాలు తీసిన వ్యక్తిని ప్రభుత్వ అధికార లాంఛనాలతో సాగనంపడం సముచితమని, ఆ గౌరవాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు ఇవ్వలేదనేది మెజారిటీ కె. విశ్వనాథ్ అభిమానుల్లో ఉంది.


గౌరవం ఇచ్చే బాధ్యత నవతరం దర్శకులది - బీవీఎస్ రవి
''పద్మశ్రీ పురస్కార గ్రహీత, తెలుగు సంప్రదాయ సంగీత నృత్య రీతులతో చిత్ర రాజాల సృష్టికర్త, సంస్కర్త అయిన కళా తపస్వికి ప్రభుత్వ అధికార వీడ్కోలు లభించలేదని పలువురు అంటున్నారు. ఆయనకు నిజమైన గౌరవం ఇచ్చే బాధ్యత, ఆయన విలువలు కాపాడుతూ సినిమాలు తీయాల్సిన నవతరం దర్శకులది అని నా అభిప్రాయం'' అని బీవీఎస్ రవి ట్వీట్ చేశారు. 


Also Read : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే 'నిజం విత్ స్మిత' మొదలు






బీవీఎస్ రవి ట్వీట్ పట్ల నిర్మాత ఎస్.కె.ఎన్. స్పందించారు. ''లెజెండరీ దర్శకుడిని ప్రభుత్వం తగురీతిలో సత్కరించాలి. మిగతా విషయాలు తర్వాత'' అని బీవీఎస్ రవికి ఎస్.కె.ఎన్ రిప్లై ఇచ్చారు. అప్పుడు ''అధికార లాంఛనాలు, గౌరవాలు ప్రభుత్వ నిర్ణయాలు. ప్రభుత్వం అంటే మెజారిటీ ప్రజలు. ఆయన అభిమానులు మైనారిటీ ఏమో!? లేక ఆయన వారసులు ప్రభావవంతులు కాకపోవచ్చునేమో!?'' అని రవి పేర్కొన్నారు. 


Also Read : పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌






'శంకరాభరణం', 'స్వయం కృషి', 'సాగర సంగమం', 'శుభ సంకల్పం', 'సప్తపది', 'సిరి సిరి మువ్వ', 'స్వాతి ముత్యం', స్వర్ణ కమలం', 'స్వాతి కిరణం', 'స్వరాభిషేకం', 'జీవన జ్యోతి' వంటి ఎన్నో గొప్ప చిత్రాలను ప్రేక్షకులకు విశ్వనాథ్ అందించి వెళ్ళారు. ఆయన సినిమాలకు, ఆయనకు పలు ఫిల్మ్ ఫేర్,  నంది, జాతీయ పురస్కారాలు వచ్చాయి. భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఆయన్ను వరించింది. 


తెలుగు చిత్ర పరిశ్రమ అంటే పరభాషా ప్రేక్షకులకు కమర్షియాలిటీ గుర్తుకు వస్తుంది. కమర్షియల్ హీరోలతో ప్రయోగాలు చేయడానికి దర్శక, నిర్మాతలు ఆలోచిస్తారు. అందరిలో కళాతపస్వి కె. విశ్వనాథ్ పంథా భిన్నమైనది. ఆయన సినిమాలు అంటే ప్రేక్షకులకు పాటలు గుర్తుకు వస్తాయి. సంస్కృతి సంప్రదాయాలు కనిపిస్తాయి. విశ్వనాథ్ అంటే అంతేనా? అని ప్రశ్నిస్తే... అంతకు మించి అనడం సముచితం. కమర్షియల్ కథానాయకులతో ప్రయోగాలు చేసిన ఘనత ఆయనది. సమాజంలో కొన్ని కట్టుబాట్లను, దురాచారాలను సినిమాల ద్వారా వెలుగులోకి తీసుకు వచ్చిన ఘనత ఆయనది.