"పాట అంటే Fill in the Blnaks కాదు. Feel in the Blanks" అని నిర్వచించిన డైరెక్టర్ కళాతపస్వి కె. విశ్వనాథ్. ఆయన సినిమాల్లోని పాటలన్నీ సూపర్ హిట్టే. పాటలు కథకు బ్రేక్ వేయకూడదని భావిస్తారు విశ్వనాథ్. అందుకే...వాటిలోనూ కథ చెప్పిస్తారు. అందుకే ఆయన సినిమాల్లోని సాంగ్స్ అలా చిరస్థాయిగా నిలబడిపోయాయి. సంగీత, సాహిత్య ప్రధాన చిత్రాలను తెరకెక్కించిన విశ్వనాథ్...ఈ రెండింటికీ సమన్యాయం చేసే దిగ్గజాలనే తన టీమ్‌లో చేర్చుకున్నారు. కేవి మహదేవన్, ఇళయరాజా, వేటూరి సుందర రామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి..ఈ కాంబినేషన్‌. ఇప్పటికీ ఎప్పటికీ సెన్సేషన్. మనసుని తాకే సిచ్యుయేషన్‌ని క్రియేట్ చేయడం వరకూ ఓ ఎత్తు అయితే..అందుకు తగ్గట్టుగా బాణీ కట్టి పదాలు కూర్చి పాటగా  మలచడం మరో ఎత్తు. విశ్వనాథ్ సినిమాల్లోని పాటలు అనగానే అందరికీ "సువ్వి సువ్వి" పాట ఠక్కున గుర్తొస్తుంది. అందుకు కారణం...ఆ పాటలోనూ "కథ" చెప్పడమే. గుండే లేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా..? అని హీరో క్వశ్చన్‌ చేయడం కథలో భాగమే. కోదండ రాముడిని నమ్ముకుంటే నిన్ను అడవుల పాలు చేశాడా..? అంటూ రామాయణ కథనూ ఇక్కడ గుర్తు చేశారు సినారె. ఈ ఆలోచన రావడానికి ఇన్‌స్పిరేషన్‌ మళ్లీ కథే. ఇదొక్కటే కాదు.


"ఆది నుంచి ఆకాశం మూగది..అనాదిగా తల్లి ధరణి మూగది.
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు...
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు..ఇన్ని మాటలు.."


అని వేటూరితో తత్త్వం చెప్పించారు విశ్వనాథ్. ఈ "కులం" గోడలు మన చేతుల్తో మనమే కట్టుకున్నాం. ముందు నుంచి ఉన్నవేం కాదు...అనే అభ్యుదయవాదానికి ఇలా పాట కట్టించి వెండితెరపై చూపించారు విశ్వనాథ్. కళాతపస్వికి సంగీతమంటే ఎంత ప్రాణమో వేటూరి కలం, బాలు గళం చాటి చెప్పింది. "అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము" అని "సంగీతం" గొప్పదనాన్ని పరిచయం చేశారు శంకరాభరణం చిత్రంలో. 


జీవితాన్ని చాలా మంది చాలా రకాలుగా నిర్వచించారు. కళాతపస్వి కూడా తనదైన స్టైల్‌లో జీవితాన్ని డిఫైన్ చేశారు. అదీ వేటూరి మాటల ద్వారా. 


"నరుడి బతుకు నటన..ఈశ్వరుడి తలపు ఘటన..
ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన"  అని వేటూరితో చెప్పించిన విశ్వనాథ్..."కలలా కరగడమా జీవితాన పరమార్థం" అంటూ సిరివెన్నెల కలాన్ని పరుగులు పెట్టించారు. 


కవిత్వం, చిత్రలేఖనం, శిల్పం చెక్కడం ఈ లలిత కళలకు గౌరవం ఇచ్చే కళాతపస్వి విశ్వనాథ్..  


"పంచ భూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన అది కవనమా.. 
కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సువర్ణ లేఖనా అది చిత్రమా..
మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవ కల్పన.. అది శిల్పమా.." అని సిరివెన్నెల రాయడానికి ఎంత స్ఫూర్తినిచ్చారో.


సాగర సంగమం చిత్రంలో క్లైమాక్స్‌లో వచ్చే పాట కంట తడి పెట్టిస్తుంది. లీడ్ క్యారెక్టర్ చనిపోయే ముందు వచ్చే ఈ పాటలో సంగీతం బాగుంటుందా, సాహిత్యం బాగుంటుందా అని అడగటం పిచ్చి ప్రశ్నే అవుతుంది. అంత బ్యాలెన్స్ చేశారు ఇళయరాజా, వేటూరి. అప్పటి వరకూ లీడ్ క్యారెక్టర్‌ని అసహ్యించుకున్న డ్యాన్సర్ చివరకు ఆయన ముందు ప్రదర్శన ఇస్తుంది. తన తప్పుని తెలుసుకుని ఆ పాట ద్వారానే తన పశ్చాత్తాపాన్నివ్యక్తం చేసేస్తుంది. ఇదంతా విశ్వనాథ్‌ ఎంత గొప్పగా వివరించి ఉంటే.."గురుదక్షిణైపోయే జీవం" అని ఒకే ఒక్క లైన్‌తో ఆ క్యారెక్టర్‌ గిల్ట్‌ని చెప్పేసి ఉంటారు వేటూరి. ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే. విశ్వనాథ్‌ పాటల్లోని సాహిత్యాన్ని విశ్లేషిస్తూ పోతే పెద్ద గ్రంథమే అవుతుంది. ఇవి అందరి నోటా వినిపించిన పాటలు కాబట్టి వీటి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం అంతే. 


Also Read: K Viswanath : సినిమాల్లో సంస్కృతికి టార్చ్ బేరర్ - విశ్వనాథ్ అంటే సాహసాలు కూడా!