అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి కన్నా ఎక్కువ సీట్లు అడుగుతున్నారన్న ప్రచారంలో నిజం లేదన్నారు మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత కొండా మురళీ. కొండా దంపతులకు ఒక్క టికెట్ ఇస్తే చాలని, వరంగల్ తూర్పు నుంచి భార్య కొండా సురేఖ నిలబడుతుంది, గెలుస్తుందని కొండా మురళీ ధీమా వ్యక్తం చేశారు. తన కూతురు ఈసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయదని స్పష్టం చేశారు.


ఆ మంత్రిలా మాయ మాటలు చెప్పను !
తాను నికార్సైన కొండా మరుళిని అని.. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లాగా మాయమాటలు చెప్పనన్నారు. మేము ఎప్పుడైనా అలా చెప్పామా? మీరు ఆలోచించాలి అన్నారు. తమకు రాజకీయాలు ముఖ్యం కాదని, ప్రజా సేవా ముఖ్యం అన్నారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గలలో భూ కబ్జాలు చూస్తే భాద అనిపిస్తోందన్నారు. 


వరంగల్ సీపీ కీ సెల్యూట్..
ఇటీవల వరంగల్ సీపీగా రంగనాథ్ నియమితులయ్యారు. ఆయన పని ఇలాగే కొనసాగించాలని, కబ్జాదారులపై ఉక్కు పాదం మోపాలన్నారు. అందుకే వరంగల్ సీపీకి సెల్యూట్ అన్నారు. మహా అయితే ఏం చేస్తారు. ట్రాన్స్ ఫర్. అక్కడ ఇలానే పని చేసే అవకాశం ఉంటుందన్నారు కొండా మురళీ. రేషన్ డీలర్ల దగ్గర బీఆర్ఎస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మేము ఎప్పుడు అవినీతికి పాల్పడలేదు కనుక మమల్ని ప్రజలు ఆదరిస్తారు. నాకు గోపాలపూర్ లో ఉన్న భూమినేఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కబ్జా చేయించారని కొండా మురళీ ఆరోపించారు. 


కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన పాదయాత్ర ప్రపంచంలోనే గొప్ప పాదయాత్రలలో ఒకటన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పట్టుదలతో పాదయాత్ర చేశారని గుర్తు చేసుకున్నారు. రాహుల్ గాంధీ స్పూర్తితో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రోజుకోక డివిజన్ లో పాదయాత్ర చేస్తామన్నారు. కొండా మురళికీ తగిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తోనే మా ప్రయాణం అని స్పష్టం చేశారు. తాను రేవంత్ రెడ్డి, కొండా సురేఖ ల పాదయాత్రలో పాల్గొంటానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ తెలిపారు. 


లిక్కర్ స్కామ్ లో కవిత..
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జాగృతి అని పెట్టారని, అయితే ఆ జాగృతికి తాగుబోతులను తయారుచేయడమే లక్ష్యం అంటూ కొండా మురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత లిక్కర్ స్కామ్ కు తెరలేపారని, తండ్రి తాగుడు చూసి కవిత లిక్కర్ స్కామ్ లో అడుగుపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా మురళీ. సురేఖ, తాను మాత్రం సేవా కార్యక్రమలతో రాజకీయాలు చేస్తామన్నారు.


రాజకీయాలు ఇలా ఉంటాయా ?
రాజకీయాలు అంటే టమాటాలు, కోడి గుడ్లు వేయడం కాదని, ప్రజలు స్పందిస్తే రాజకీయం అవుతుందన్నారు. అలాంటి రాజకీయాలను వరంగల్ జిల్లాకు పరిచయం చేశామని, ఎమ్మెల్యే అంటే ఎలా పని చేయాలో చేసి చూపించామని చెప్పుకొచ్చారు. రాజకీయాలు తమ ప్రొఫెషన్ కాదని, ప్రజా సేవే తమ పని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కొండా సురేఖ పోటీ చేసి కచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.