YS Sharmila Padayatra: వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 225వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ నైట్ క్యాంప్ నుంచి ఈరోజు పాదయాత్ర ప్రారంభం అయింది. చింత నెక్కొండ, సాయి రెడ్డి పల్లి, ఏబి తాండా, దౌలత్ నగర్, పర్వతగిరి, తుర్కల సోమారం, గుంటపల్లి, జమలాపురం మీదుగా వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర సాగనుంది.
ఫిబ్రవరి రెండో తేదీ నుంచి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభం
ఫిబ్రవరి రెండో తేదీన రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఅర్ 9 ఏళ్ల పాలనపై వినతి పత్రం అందజేశారు. గవర్నర్ కలిసిన అనంతరం రాజ్ భవన్ నుంచే నేరుగా పాదయాత్రకు బయలు దేరారు షర్మిల. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర పునఃప్రారంభించారు. వరంగల్ జిల్లాలో ఆగిన చోట నుంచే ప్రజాప్రస్థానం పాదయాత్రను తిరిగి ప్రారంభించారు షర్మిల. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజక వర్గం చెన్నారావుపేట మండలం శంకరమ్మ తాండా నుంచి పాదయాత్ర తిరిగి మొదలుపెట్టారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆగిన చోట నుంచి ప్రారంభించారు. భారీ బందోబస్తు మధ్య షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. వైయస్ షర్మిలకు వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు.
వైయస్ఆర్ ప్రజా దర్బార్ పెట్టి నేరుగా జనం సమస్యలు తెలుసుకున్నారని షర్మిల పాదయాత్రలో తెలిపారు. కేసీఆర్ పాలనలో మాత్రం సామాన్యుడు కాదు కదా ఉద్యమకారులకు కూడా ఆయనను కలిసే అనుమతి లేదని విమర్శించారు. కేసీఆర్ కు ప్రజల ముందుకొచ్చే దమ్ము ధైర్యం ఉంటే తాము పంపిస్తున్న బూట్లు వేసుకొని తమతోపాటు పాదయాత్ర చేయాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో ఎప్పుడూ ప్రజా దర్బార్ పెట్టిన సందర్భాలు లేవని విమర్శించారు. ప్రజా సమస్యలు తెలుసుకున్నది లేదన్నారు. రాజకీయాల కోసం రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతున్నారు కానీ, తెలంగాణ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుందామన్న సోయి లేదన్నారు.
సీఎం కేసీఆర్ కు బూట్ల బహుమతిగా పంపిన షర్మిల
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. రాష్ట్రంలో సమస్యలే లేవని నిరూపిస్తే ముక్కు నేలకు రాసి రాజకీయాల్నుంచి తప్పుకుంటానన్నారు. సీఎం కేసీఆర్ పాలన అద్భుతమని అనుకుంటున్నారని, అది వాస్తవమయితే తమతో పాదయాత్రకు రావాలని షర్మిల సవాల్ చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఒక్కరోజు తమతో పాదయాత్రకు రావాలన్నారు. కేసీఆర్ పాదయాత్రకు రావాలని బూట్లు కూడా పంపిస్తున్నామని షర్మిల అన్నారు.
"కేసీఆర్ కు దమ్ముంటే మాతో పాదయాత్రకు రావాలి. అందుకే ప్రగతి భవన్ కు బూట్లు కూడా పంపిస్తున్నా. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ఊసే ఎత్తకపోవడం దుర్మార్గం. ఈ సారి కూడా విభజన చట్టంలోని హామీలను పట్టించుకోలేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, పసుపు బోర్డ్, ములుగు ట్రైబల్ యూనివర్సిటీ ప్రస్తావనే లేదు. దేశంలో 2 కోట్ల ఉద్యోగాల కల్పన సైతం కనపడనే లేదు. అయినా అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అన్నట్లు. మన దొర ఏనాడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడిండా? ప్రధాని రాష్ట్రానికొస్తే ఎదురెళ్లి విభజన సమస్యలు పట్టించుకోరా అని అడిగిండా? అందుకే తెలంగాణ ప్రజలకు BRS - BJP పార్టీలు శాపంగా మారాయి"- వైఎస్ షర్మిల