Telangana Budget 2023: తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి తమిళిసై ప్రసంగించారు. ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షత వల్ల తెలంగాణ అపూర్వ విజయాలు సాధించిందన్నారు. ఒకప్పుడు కరెంటు కోతలతో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ.. ప్రభుత్వ అవిరళ కృషితో నేడు 24 గంటల విద్యుత్ సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో మార్పు కనిపిస్తుందన్నారు. సీఎం, ప్రజాప్రతినిధుల కృషితోనే ఇదంతా సాధ్యమైందన్నారు. తెలంగాణలో ఎన్నో విజయాలు సాధించాం. సంక్షేమ, అభివృద్ధిలో రోల్‌మోడల్‌గా ఉన్నామన్నారు.
వ్యవసాయం కుదేలై విలవిలలాడిన నేల.. నేడు దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించిందని పేర్కొన్నారు. తాగునీటి కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడి, 100 శాతం గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను సరఫరా చేస్తున్నది వెల్లడించారు. ఒకనాడు పాడుబడినట్టున్న తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారి, నేడు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శవంతంగా తయారయ్యాయని తెలిపారు. పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచ స్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీ రంగంలో మేటి రాష్ట్రంగా ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నది. పర్యావరణ పరిరక్షణలోనూ, పచ్చదనం పెంపుదలలోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నదన్నారు. .
కాళేశ్వరాన్ని రికార్డు స్థాయిలో పూర్తి చేసి ప్రపంచ దృష్టి ని ఆకర్షించామన్నారు. దీని ఫలితంగానే సాగు ఇరవై లక్షల ఎకరాల నుంచి 73. 33 లక్షల ఎకరాలకు పెరిగింది. త్వరలో కోటి ఎకరాలకు పేగా సాగునీరు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. రైతు బంధు పథకం ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఈ పథకానికి ఐక్యరాజ్యసమితిలో కూడా ప్రశంసలు దక్కాయి. రైతులకు 65వేల కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందించాం. రైతుకు ఐదు లక్షల విలువైన జీవిత బీమా అందిస్తున్నామన్నారు తెలంగాణ గవర్నర్. వ్యవసాయ రంగంలో స్థిరీకరణ సాధించామన్న గవర్నర్... వ్యవసాయాన్ని పండగలా మార్చామని కితాబు ఇచ్చారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో రైతుల్లో భరోసా పెరిగిందన్నారు. చెరువుల పునరుద్దరణ, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసిందన్నారు.
2014-15లో రూ.62 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదాయం.. ప్రభుత్వ కృషివల్ల 2021 నాటికి రూ.1 లక్షా 84 వేల కోట్లకు పెరిగిందన్నారు. రాష్ట్రం సిద్ధించేనాటికి రూ.లక్షా 24 వేలుగా ఉన్న తలసరి ఆదాయం.. 2022-23 నాటికి రూ.3.17 లక్షలకు చేరిందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి రెట్టింపుస్థాయిలో జరిగిందన్నారు. అన్నిరంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధించిన ప్రభుత్వాన్ని అభినందించారు. 2014-15లో 68.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉండగా.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలు కారణంగా అది 2 కోట్ల 2 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు గవర్నర్. తెలంగాణ జీఎస్‌డీపీలో 18.2 శాతం వ్యవసాయ రంగం నుంచే వస్తోంది.
ఫ్లోరైడ్ నుంచి ప్రజలకు విముక్తి లభించిందని కేంద్రమే పార్లమెంట్‌లో ప్రకటించింది. దళిత బంధు పథకాన్ని ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిస్తున్నాం. ఒకప్పుడు కరెంటు కోతలతో సతమతమవుతున్న తెలంగాణ తమప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నేడు ఇరవై నాలుగు గంటల కరెంటు సరఫరా చేస్తోందన్నారు. మొదట గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. కానీ తర్వాత జరిగిన పరిమామాలతో గవర్నర్ ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు.