తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంటే పరభాషా ప్రేక్షకులకు కమర్షియాలిటీ గుర్తుకు వస్తుంది. మూకీ సినిమా నుంచి టాకీల వరకూ... 'బడి పంతులు' నుంచి 'బాహుబలి' వరకూ... తెలుగులో ఎన్నో వేల చిత్రాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ కమర్షియల్ సినిమాలే. తెలుగు ప్రేక్షకులూ కమర్షియాలిటీతో వచ్చిన చిత్రాలకు విజయాలు అందించారు. అందువల్ల, కమర్షియల్ హీరోలతో ప్రయోగాలు చేయడానికి దర్శక, నిర్మాతలు ఆలోచిస్తారు. అందరిలో కళాతపస్వి కె. విశ్వనాథ్ పంథా భిన్నమైనది.
విశ్వనాథ్ సినిమాలు అంటే ప్రేక్షకులకు పాటలు గుర్తుకు వస్తాయి. ఆయన తీసిన సినిమాల్లో ఉన్నతమైన సాహిత్య విలువలు ఉంటాయి. సంస్కృతి సంప్రదాయాలు కనిపిస్తాయి. విశ్వనాథ్ అంటే అంతేనా? అని ప్రశ్నిస్తే... అంతకు మించి అనడం సముచితం. కమర్షియల్ కథానాయకులతో ప్రయోగాలు చేసిన ఘనత ఆయనది. సమాజంలో కొన్ని కట్టుబాట్లను, దురాచారాలను సినిమాల ద్వారా వెలుగులోకి తీసుకు వచ్చిన ఘనత ఆయనది.
చిరంజీవి చెప్పులు కుట్టడం ఏమిటి?
'స్వయం కృషి' (1987)లో చిరంజీవి చెప్పులు కుట్టే వ్యక్తిగా నటించారు. బహుశా... ఈ తరం ప్రేక్షకులు అప్పట్లో చిరంజీవి స్టార్ కాదు కాబట్టి ఆయన అది చేశారని అనుకోవచ్చు. అప్పటికి 'ఖైదీ' (1983) వచ్చింది. విజయ దుందుభి మోగించింది. చిరు ఇమేజ్ క్యాష్ చేసుకోవాలని విశ్వనాథ్ అనుకోలేదు. తనదైన శైలి కథ, కథనాలతో సినిమా చేశారు. 'శుభలేఖ', 'ఆపద్బాంధవుడు' సినిమాల్లోనూ చిరంజీవి స్టార్ కాదు... సామాన్యుడు! విశ్వనాథ్ దర్శకుడు కాబట్టే ఆ సినిమాలు సాధ్యం అయ్యాయని చెప్పవచ్చు.
శోభన్ బాబును 'చెల్లెలి కాపురం'లో చూశారా?
'స్వాతి ముత్యం'లో కమల్ హాసన్ నటన...
శోభన్ బాబుకు అందగాడు ఇమేజ్ ఉంది. ఆయన్ను 'చెల్లెలి కాపురం' చిత్రంలో నల్లగా చూపించారు విశ్వనాథ్. మలయాళ స్టార్ మమ్ముట్టితో తెలుగులో 'స్వాతి కిరణం' వంటి సినిమా చేయించిన ఘనత కూడా ఆయనదే. 'స్వాతి ముత్యం'లో కమల్ హాసన్ చేత అమాయకుడి వేషం వేయించి... ఆయనలో అద్భుతమైన నటుడిని కొత్త కోణంలో వెలుగులోకి తీసుకొచ్చారు.
వితంతువుకు వివాహం...
కుల వ్యవస్థపై బాణం!
కాలంతో పాటు ప్రజలు, ఆలోచనలు, పద్ధతులు, కట్టుబాట్లు మారాలని సినిమాల సాక్షిగా చెప్పిన దర్శకులలో విశ్వనాథ్ ఒకరు. 'స్వాతి ముత్యం'లో వితంతువుకు మళ్ళీ వివాహం చేయాలనే ఆలోచన ప్రజల్లో కలిగించిన సినిమా. కుల వ్యవస్థను సమాజం నుంచి తరిమేయాలని, కట్టుబాట్లు మారాలని 'సప్తపది'లో చెప్పారు.
సంగీతం నేర్చుకోవడానికి దేవదాసి కుమార్తె అయితే ఏంటి? అసలు, ఆ కథ ఏమిటి? 'శంకరాభరణం' కథను విశ్వనాథ్ నుంచి కాకుండా మరొకరి నుంచి ఊహించగలమా? అవినీతి, కుల వ్యవస్థ, కట్టుబాట్లు వంటి అంశాలు ఎన్నింటినో ఆయన సినిమాల్లో ప్రస్తావించారు. సమాజాన్ని చైతన్యం చేయడానికి ప్రయత్నించారు.
విశ్వనాథ్ సినిమాల్లో సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. పదాలు చాలవు. రోజులు సరిపోవు. మన సంస్కృతీ సంప్రదాలకు ఆయన పెద్ద పీట వేశారు. తెలుగు చిత్రసీమకు 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి వంటి గొప్ప గేయ రచయితలను విశ్వనాథ్ పరిచయం చేశారు. వాళ్ళతో ఎన్నో ప్రయోగాలు చేయించారు. 'శంకరాభరణం', 'సిరివెన్నెల', 'శృతి లయలు' - అసలు రెండు మూడు సినిమాలు ఏమిటి? ఆయన సినిమాలు అన్నిటిలో పాటలు సూపర్ హిట్.
Also Read : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే 'నిజం విత్ స్మిత' మొదలు
సినిమా విజయాలకు కమర్షియాలిటీ ఒక్కటే మార్గం కాదని... కొత్తగా తీస్తూ, హీరోను ధీరోదాత్తుడిగా చూపించకుండా అంధుడిగా, చెప్పులు కుట్టేవాడిగా, పశువుల కాపరిగా చూపించినా విజయాలు అందుకోవచ్చని దారి చూపించిన టార్చ్ బేరర్ కె. విశ్వనాథ్. ఇప్పుడు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా... సినిమాలతో ఎప్పుడూ మనల్ని పలకరిస్తూ ఉంటారు.
Also Read : 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?