Annamayya District Crime: అన్నమయ్య జిల్లా రాయచోటిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు.. ఓ న్యూస్ రిపోర్టర్ పై కాల్పులకు పాల్పడ్డారు. శివాలయం కూడలి వద్ద విలేకరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 


పీలేరులో పని చేస్తున్న పర్వతరెడ్డిపై కాల్పులు


ప్రముఖ ఛానెల్‌లో విలేకరిగా పని చేస్తున్న 45 ఏళ్ల పర్వత రెడ్డి.. పీలేరులోని కార్యాలయంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈయనపై గత నెల 31వ తేదీన సాయంత్రం ఈ గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. సాయంత్రం 5.30కు చిత్తూరు రింగ్ రోడ్డు నుంచి బయలుదేరి రాయచోటికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా శివాలయం కూడలి వద్దకు రాగానే గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పర్వత రెడ్డి తీవ్రంగా గాయపడినట్లు పట్టణ సీఐ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ప్రమాదం జరిగిన విషయం గుర్తించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వాహనాల టైర్ల కింది నుంచి ఓ రాయి వచ్చి తగలడం వల్లే రక్తస్రావం జరుగుతుందని అంతా భావించారు. కాల్పులు జరిగినట్లు ఎవరికీ తెలియదు. 


శరీరంలో బుల్లెట్ ఉన్నట్లు గుర్తించిన వైద్యులు


అయితే ఆస్పత్రికి వెళ్లిన తర్వాత పర్వత రెడ్డిని పరిశీలించిన వైద్యులు... అతడి శరీరంలో బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వెంటనే అతడిని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించడంతో.. అక్కడి వైద్యులు శస్త్రచికిత్స ద్వారా బుల్లెట్ ను వెలికి తీశారని సీఐ సుధాకర్ రెడ్డి వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కాల్పులు జరిపిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే బాధితుడు పర్వత రెడ్డికి, వారి బంధువులకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. 


నిన్నటికి నిన్న గుంటూరు టీడీపీ నేతపై కాల్పులు


గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అలవాలలో కాల్పులు కలకలం రేగాయి. రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇంట్లో ఉన్న సమయంలో తుపాకీతో ప్రత్యర్థులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. బాలకోటి రెడ్డికి బులెట్ గాయాలు కాగా, అతణ్ని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కాల్పులను గడ్డం వెంకట్రావు, పమ్మి వెంకటేశ్వర్ రెడ్డి, పూజల రాముడు అనే వ్యక్తులు చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో రొంపిచర్ల ఎంపీపీగా వెన్న బాల కోటిరెడ్డి పని చేశారు. పక్కా ప్లాన్ తో రొంపిచర్ల వైసీపీ ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, అతని అనుచరులు దాడికి పాల్పడినట్లు సమాచారం.


నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆసుపత్రిలో బాలకోటిరెడ్డి పరామర్శించారు. వెన్న బలకోటి రెడ్డి పై హత్యాయత్నం ముమ్మాటికీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పనే అని ఆయన అన్నారు. బలకోటి రెడ్డికి ఏమైనా జరిగితే వైఎస్ఆర్ సీపీ సర్కారుదే బాధ్యత అని అన్నారు. బాలకోటి రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు హాస్పిటల్ కి తరలించామని టీడీపీ ఇన్-చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు చెప్పారు.