K. Viswanath: కె.విశ్వనాథ్ సినిమాలు తెలుగు పరిశ్రమపై ఉన్న ధోరణిని మార్చేశాయి. ఆయన సినిమాలు దక్షిణాది రాష్ట్రాల్లో సంగీతాన్ని నిద్రలేపాయి.కళను ఆరాధించేవాళ్లతో కన్నీళ్లు పెట్టించాయి..లేచి నిలబడి తలొంచి నమస్కరించేలా చేశాయి..ఆత్మగౌరవంతో ఎలా బతకాలో నేర్పించాయి. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వర్ణకమలం, శుభసంకల్పం ఇలా ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు తెలుగు వారికి అందించిన మహనీయులు కళాతపస్వి కె.విశ్వనాథ్ . ఆయనకు శివుడంటే మహాఇష్టం..అందుకే దాదాపు విశ్వనాథ్ సినిమాల్లో శివుడి ప్రస్తావన, పాట తప్పనిసరిగా ఉంటుంది. అదికూడా ఏదో కథలో ఇరికించే ప్రయత్నం కాదు..కథలో అలా కలసిపోతుంది..అదీ కళాతపస్వి గొప్పతనం..



Also Read: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు


సిరివెన్నెల - ఆదిభిక్షువు వాడినేది కోరిది బూడిదిచ్చేవాడినేది అడిగేది
'సిరివెన్నెల' ఇది భక్తి సినిమా కాదు..శివుడి గురించి చెప్పే సినిమా అస్సలే కాదు. ఓ కళాకారుడి కోరిక నెరవేరాలని శివుడిని వేడుకోమని...తనను ఆరాధించే అమ్మాయి చెబితే..అందుకు సమాధానంగా...బూడిదిచ్చే శివుడుని ఏం కోరుకోవాలి, తియ్యటి పాటలు పాడే కోకిలకి నలుపు రంగేంటి..? గర్జనలు చేసే ఆ మేఘాలకి మెరుపులు అద్దడం ఏంటి..? అని వివరిస్తాడు. ఇక్కడ శివ లీలను తెలియజేయడమే కాదు..మనం ఏం కోరుకున్నప్పటికీ మనకు ఏం ఇవ్వాలో ఆ శివయ్యకి తెలుసని చెప్పే చక్కని వివరణ



సాగరసంగమం- తకిట తథిమి తందానా
జీవితంలో ఓడిపోయి, అయినవారిని కోల్పోయి..కలలు నెరవేరక, కళను ప్రదర్శించే అవకాశం రాక.. జీవితంపై నిర్వేదం పేరుకుపోయినప్పుడు..ఉంటే ఎంత పోతే ఎంత అనే ఫీలింగ్ ని బతుకుని ఆటగా చూసే కథానాయకుడి అభిప్రాయాన్ని ఇలా 
"నరుడి బత్రుకు నటన ఈశ్వరుని తలపు ఘటన  ఈ రెంటి నట్టనడుమ నీకెందుకింత తపన" అంటూ ఈశ్వరతత్వానికి ముడిపెట్టారు కె.విశ్వనాథ్



స్వర్ణకమలం - అందెలరవమిది
కథానాయికలోని అల్లరిని, చిలిపితనాన్ని మాత్రమే కాదు..ఆమెలో నివురుగప్పిన నిప్పులా ఉన్న కళాకారిణిని చూడాలన్న తపన .. ఇతరదేశస్తులు కూడా భారతీయ కళలని అభ్యసించడానికి తమ జీవితాన్ని ధారపోస్తున్నారని అర్ధమయ్యేలా చెబుతూ.. శాశ్వతమైన పరిపూర్ణమైన,  ఆనందానికి దూరమువుతున్న కధానాయికని చేయిపట్టి నడిపించే ప్రయత్నంలో..ఆమెలో అసలైన కళాకారిణి మేల్కొన్న సందర్భంగా పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ నటరాజుకి అంకితం చేసిన పాట ఇది.



శంకరాభరణం- శంకరా నాదశరీరాపరా
శంకరాభరణం సినిమాలో... తోటి కళాకారులు తాను తీసుకువచ్చిన మనిషిలో కళను చూడకుండా, కులాన్నే చూసి వేదిక వదిలి వెళ్ళిపోతే, శంకరశాస్త్రి బాధతో ఆవేదనతో ఎదుట ఉన్న శివుడిని నిందిస్తూ, ధారాపాతంగా వాన కురుస్తున్నా పట్టించుకోకుండా "పరవశాన శిరసూ గంగ; ధరకు జారెనా శివగంగ" అంటూ శివుడిని నిలదీస్తూ ప్రశ్నిస్తే పాట అద్భుతం 



ఆపద్భాంధవుడు- శివుడి గెటప్
చిరంజీవికి ఉత్తమ నటుడిగా రెండో సారి నంది అవార్డు తీసుకొచ్చిన చిత్రం. శివుడు పేరెత్తితే ఊగిపోయే కథానాయకుడికి ఆ వేషం వేసే అవకాశం వస్తే ఇక శివతాండవమే అనిపించాడు..



సాగర సంగమం- 
పంచభూతాలు అంటే భూతాలు దయ్యాలు కాదు.. ఆ భూతనాథుడైన శివుడి అధీనంలో ఉండే ప్రకృతి. అందుకే శివం పంచభూతాత్మకం అంటారు. దీనికి సరైన అర్థం తెలియని కళాకారిణి కళను అవమానిస్తుంటే చూసి భరించలేని అసలు సిసలు కళాకారుడు నటరాజు సన్నిధిలో అసలైన అర్థాన్ని చెప్పే సందర్భం అద్భుతం..


ఇంకా చెప్పుకుంటే ఎన్నో సందర్భాలున్నాయి...


Also Read: టాలీవుడ్‌ను ఖండాంతరాలకు తీసుకు వెళ్ళారు, తీరని లోటు - విశ్వనాథునికి చిరంజీవి, ఎన్టీఆర్, మమ్ముట్టి నివాళులు