'అవతార్ : ద వే ఆఫ్ వాటర్' (Avatar The Way Of Water) సినిమా ఎప్పుడు ఎప్పుడు చూద్దామా? అని ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ శుక్రవారమే 'అవతార్ 2' విడుదల అవుతోంది. అంత కంటే ముందు పలు నగరాల్లో ప్రీమియర్ షోలు పడుతున్నాయి. ఆల్రెడీ లండన్‌లో ప్రీమియర్ షో వేశారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ప్రీమియర్ షోకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి 'అవతార్' సృష్టికర్త జేమ్స్ కెమరూన్ రావడం లేదు. ఎందుకంటే...
జేమ్స్ కామెరూన్‌కు కరోనా!
James Cameron Tested Covid 19 Positive : జేమ్స్ కామెరూన్‌కు కరోనా మహమ్మారి సోకింది. ఆయనకు కొవిడ్ 19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దాంతో ఐసోలేషన్‌లోకి వెళ్ళారు. అందువల్ల, లాస్ ఏంజిల్స్‌లో 'అవతార్ 2' ప్రీమియర్ షోకి అటెండ్ కావడం లేదు. 'నా సొంత పార్టీకి నేను అటెండ్ కాలేకపోతున్నాను' అని జేమ్స్ కెమరూన్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లండన్ ప్రీమియర్ షోకి ఆయన అటెండ్ అయ్యారు. 'అవతార్' ప్రమోషన్స్ కోసం ఆయన పలు నగరాలు తిరుగుతున్నారు. ఈ ప్రయాణాల కారణంగా కరోనా బారిన పడి ఉండొచ్చు. రెగ్యులర్ చెకప్స్‌లో భాగంగా టెస్ట్ చేయగా కరోనా అని తేలిందట.
ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో డిసెంబర్ 16న సినిమా విడుదల అవుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రేక్షకుల్లో కూడా సినిమాపై మంచి బజ్ బావుంది. తెలుగు మార్కెట్ మీద హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం తెలుగు బాగా తెలిసిన రచయిత, దర్శకుడు, కథానాయకుడికి మాటలు రాసే బాధ్యత అప్పగించారు.
అవసరాల మాటల్లో 'అవతార్ 2'
అవసరాల శ్రీనివాస్ (Srinivas Avasarala) కథానాయకుడు మాత్రమే కాదు... హీరో కంటే ముందు ఆయనలో రచయిత ఉన్నాడు. తెలుగు భాషా ప్రేమికుడు ఉన్నాడు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు చూస్తే చాలు... అవసరాల తెలుగు ఎంత స్పష్టంగా, డైలాగులు ఎంత సూటిగా ఉంటాయో ఉంటుందో తెలుస్తుంది. అందుకే, ఆయన చేత 'అవతార్ 2'కి డైలాగులు రాయించినట్టు ఉన్నారు.
Also Read : రాజమౌళి అనుమానించాడు గానీ ప్రభాస్ కాదు
అవసరాలతో అడ్వాంటేజ్ ఏంటంటే... ఆయన హాలీవుడ్ సినిమాలు, ఇంగ్లీష్‌పై మంచి పట్టు ఉంది. అమెరికాలో కొన్నాళ్ళు ఉద్యోగం చేసి వచ్చిన వ్యక్తి కావడంతో అక్కడ ప్రొడక్షన్ వ్యవహారాలపై అవగాహన ఉంది. 'అవతార్ 2' మాటల్లో ఆత్మ పట్టుకుని తెలుగుకు తగ్గట్టు మంచి సంభాషణలు రాశారట.
'అవతార్' (Avatar Movie)... భారతీయ ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేని సినిమా పేరు. నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని తేడాలు లేకుండా అన్ని రాష్ట్రాల్లో, అన్ని భాషల్లో విజయం సాధించింది. పండోరా గ్రహం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. పండోరా గ్రహంలో జీవులు కూడా నచ్చేశాయి. ఇప్పుడు 'అవతార్'కు సీక్వెల్ వస్తోంది. భారతీయుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాపై ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు ఉదాహరణ... అడ్వాన్స్ బుకింగ్స్! ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ రావచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రీ సేల్స్ అయితే సూపర్ ఉన్నాయి.