తెలుగు చిత్ర పరిశ్రమలో, ఆ మాటకు వస్తే భారతీయ చిత్రసీమలో అపజయం ఎరుగని దర్శకుడు ఎవరు? అంటే ఆ తరం, ఈ తరం అని తేడా లేకుండా ప్రేక్షకులు అందరూ ముక్త కంఠంతో చెప్పే ఏకైక పేరు రాజమౌళి (Rajamouli). ఇప్పుడు దర్శక ధీరుడి పేరు భారతదేశంలో మాత్రమే కాదు... అంతర్జాతీయ స్థాయిలో వినబడుతోంది. 'ఆర్ఆర్ఆర్'కు వస్తున్న అవార్డులు, నామినేషన్లు చూసి అందరూ మాట్లాడుతున్నారు. ఇటువంటి రోజు ఒకటి వస్తుందని రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడో ఊహించారు. అయితే, అప్పుడు రాజమౌళి అనుమానించారట. ఈ విషయాన్ని స్వయంగా దర్శక ధీరుడు వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే...
'ఆర్ఆర్ఆర్' (RRR Movie International Award Nominations) సినిమాకు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సినిమా నామినేట్ అవుతోంది. 'ఆర్ఆర్ఆర్'కు ముందు రాజమౌళి తీసిన 'బాహుబలి' సినిమాలో కథానాయకుడు ప్రభాస్ సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో దర్శక ధీరుడితో పాటు చిత్ర బృందాన్ని అభినందిస్తూ ఒక పోస్ట్ చేశారు. రాజమౌళి ప్రపంచాన్ని జయిస్తారని పేర్కొన్నారు. అప్పుడు రాజమౌళి ఏం అన్నారో తెలుసా?
''థాంక్యూ డార్లింగ్! నాపై నేను సందేహం వ్యక్తం చేసినప్పుడు... అంతర్జాతీయ స్థాయిలో నాకు గుర్తింపు వస్తుందని నమ్మావు'' అని రాజమౌళి రిప్లై ఇచ్చారు.
'బాహుబలి : ది బిగినింగ్', 'బాహుబలి : ది ఎండింగ్', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఆయన్ను... హాలీవుడ్ అవార్డులు వరించడం మొదలుపెట్టాయి. నామినేషన్స్ వస్తున్నాయి. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్' నామినేట్ అయ్యింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'నాటు నాటు...' పాటకు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి నామినేట్ అయ్యారు.
Also Read : హ్యాపీ బర్త్ డే వెంకటేష్ - వయసుతో పాటు మారిన కథానాయకుడు, ప్రయోగాలకు భరోసా ఇచ్చిన 'విక్టరీ'
ఇప్పటి వరకు వచ్చిన అవార్డులు చూస్తే...
లాస్ ఏంజెల్స్ క్రిటిక్స్ అవార్డుల్లో 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' అవార్డు ఎంఎం కీరవాణికి దక్కింది. ఇక ఉత్తమ దర్శకుడి విభాగంలో ఎస్.ఎస్.రాజమౌళి రన్నరప్‌గా నిలిచారు. ఈ ఏడాది 'ఆర్ఆర్ఆర్'కు గాను ఉత్తమ దర్శకుడిగా రాజమౌళికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు ఇచ్చింది. సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఉత్తమ దర్శకుడి విభాగంలో రన్నరప్‌గా నిలిచారు.
బోస్టన్ సొసైటీ నుంచి కూడా కీరవాణికి ఒక అవార్డు వచ్చింది. అంతకు ముందు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి కూడా 'ఆర్ఆర్ఆర్' అవార్డు అందుకుంది. 'ఆర్ఆర్ఆర్' కాస్ట్ అండ్ క్రూ (నటీనటులు, సాంకేతిక నిపుణులు) కు స్పాట్ లైట్ విన్నర్ అవార్డు వచ్చింది.
అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి...
RRR Movie Wins Best International Picture at Atlanta Film Critics Circle : ఆల్రెడీ 'బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్'గా అవార్డులు అందుకున్న 'ఆర్ఆర్ఆర్'కు, అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ కూడా అదే విభాగంలో అవార్డు ఇచ్చింది. దీంతో ఆ అవార్డుల సంఖ్య మూడుకు చేరింది. ఇంతకు ముందు... సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో నాలుగు హాలీవుడ్ సినిమాలతో పోటీ పడి మరీ 'ఉత్తమ అంతర్జాతీయ సినిమా' విభాగంలో 'ఆర్ఆర్ఆర్' విజేతగా నిలిచింది. శాటన్ (50th Saturn Awards) పురస్కారాల్లో 'ఆర్ఆర్ఆర్'కు 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా కీలక పాత్రలు పోషించగా... అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ విలన్ రోల్స్ చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ మూవీస్ పతాకంపై డీవీవీ దానయ్య సినిమా నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.