Karimnagar News: అందరికీ అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థ ఆర్టీసీ బస్సు... తన సర్వీస్ ల ద్వారా  నిత్యం వేల మందిని ఒక చోట నుంచి మరొక చోటుకు తరలిస్తూ సురక్షిత ప్రయాణానికి భరోసా ఇస్తూ ఉంటుంది. అందుకే బస్టాండ్‌ల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అయితే ఇవి కొన్ని రోజులు పని చేసి ఆ తర్వాత పాడయ్యాయి. వాటిపై పర్యవేక్షణ లేకపోవడంతో నిరుపయోగంగా ఉంటున్నాయి. సీసీ కెమెరాలు పనిచేయక పోవడంతో దొంగతనాలు, పోకిరిల బెడదతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విస్తీర్ణం, ప్లాట్ ఫాం పరంగా రాష్ట్రంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, కరీంనగర్ జిల్లా బస్టాండ్ రెండో స్థానంలో ఉంది. 


ఏవైనా ఘటనలు జరిగినప్పుడు సులువుగా గుర్తించడానికి వీలుగా పోలీస్ శాఖ సహకారంతో కరీంనగర్ బస్టాండులో 65 పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అందులో 45 కి పైగా బస్టాండ్ ఆవరణలో, 20 బయట ఉన్నాయి. వీటి నిర్వహణ చూసుకోవడానికి పోలీస్ శాఖకు ఒక గదిని కేటాయించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ప్రయాణ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన కేబుల్ తీగలు తెగిపోగా బస్టాండులో ఉన్నవి కూడా పాడై పని చేయడం లేదు. కొన్ని మాత్రం అంతంత మాత్రంగా పని చేస్తున్నాయి. రికార్డు కావడం లేదు. వీటిపై అధికారులు దృష్టి పెట్టడం లేదు.


పలు నేరాల కట్టడిలో సీసీటీవీలే కీలకం...


బాంబు పేలుళ్లు, ఇతర ఘటనలు, దొంగతనాలు, జరిగినప్పుడు నిందితులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ముఖ్యపాత్ర వహిస్తాయి. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా దుండగులను గుర్తించడం సులువుగా ఉంటుంది. గతంలోనూ పలు కేసుల్లో పోలీసులలో నిదుతులను పట్టుకున్నారు. ప్రస్తుతం అవి పని చేయకపోవడంతో ఏదైనా జరిగితే పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది. పోలీసు శాఖ బస్టాండ్ ఆవరణలో బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. వీటిని ఆర్టీసీ ప్రధాన ప్రాంగణంలో ఓ గదిని కూడా కేటాయించింది. రిపేర్ వచ్చినప్పుడు బాగు చేయడానికి, కొత్తవి  కొనడానికి ఇటువంటి ఆర్టీసీ కానీ పోలీస్ శాఖకు కానీ ప్రత్యేక నిధులు అంటూ ఏమీ లేదు. పని చేయునప్పుడు రిపేర్ చేయడానికి ఓ వ్యక్తికి అప్పగించగా అతనికి డబ్బులు చెల్లించకపోవడంతో వాటిని బాగు చేయడానికి ముందుకు రావడం లేదు. 


సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రయాణికుల బ్యాగులు, లాప్ టాప్ లు, ఇతర విలువైన సామాన్లను దొంగలిస్తున్నారు. 15 ఏళ్ల కిందట కరీంనగర్ బస్టాండులో హైదరాబాద్ ప్లాట్ ఫాం వద్ద టిఫిన్ బాక్స్ బాంబు పేలడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కొన్నాళ్ల తర్వాత కూడా ఇలాంటి ఘటన మరొకసారి కలకలం రేపింది. ఇటీవల కొందరు పోకిరీలు పనిగట్టుకుని బస్టాండ్లో దురుసుగా ప్రవర్తించినట్లు ప్రయాణికులు తెలిపారు. ఆర్టీసీ డ్రైవర్ బ్యాగును ఓ వ్యక్తి దొంగతనం చేసి తీసుకెళ్తుండగా ప్రయాణికులు పట్టుకున్నారు. పోయిన నెల చివరి వారంలో జిల్లా బస్టాండులో ప్రయాణికురాలు దొంగతనానికి గురైంది. అందులో ఫోను, బంగారు నగలు, డబ్బులు ఉన్నాయి. కొన్ని రోజుల కిందట హుస్నాబాద్ బస్టాండులో నాటు బాంబులు పేలాయి. పందుల బెడద తొలగించుకోవడానికి కొందరు వీటిని తీసుకెళ్తుండగా అవి పేలినట్లు తెలిసింది. ఇలాంటి ఎన్నో రకాల సంఘటనలను వివరించాలంటే సీసీటీవీ ల పై మరింత శ్రద్ధ చూపడం మంచిది.