దేశ రాజధానిలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఢిల్లీలోని సర్దార్‌ పటేల్‌ మార్గ్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఈ నెల 14న (బుధవారం) ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేసీఆర్‌ సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట.. మనవడు హిమాన్షు, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ సహా 16 మంది వచ్చారు. మంత్రులు, ఎంపీలు, నేతలతో కలిసి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, యాగం పనులను సీఎం సమీక్షించారు. ఇవాళా, రేపు నవచండీ హోమం నిర్వహించనున్నారు. బుధవారం పూర్ణాహుతి తర్వాత పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, బీఆర్‌ఎస్‌ జెండాను ఎగుర వేస్తారు. ఆ తర్వాత నుంచి అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఉనికిలోకి వస్తుంది. కాగా, ప్రస్తుతం ప్రారంభిస్తున్నది తాత్కాలిక కార్యాలయమే అయినందున కొద్ది మంది జాతీయ నేతలను మాత్రమే ఆహ్వానించినట్లు తెలిసింది. శాశ్వత కార్యాలయం వసంత విహార్‌లో ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. దీని ప్రారంభోత్సవం భారీ ఎత్తున ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. దేశ రాజకీయాలకు బీఆర్‌ఎస్‌ కార్యాలయం కూడలి కానుందని అంటున్నారు. బీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వెలిశాయి.


యాగానికి ఏర్పాట్లు పూర్తి
రాజశ్యామల యాగం కోసం ప్రత్యేక యాగశాల నిర్మించారు. ఉదయం 9 గంటల నుంచి 12 మంది రుత్వికులు గణపతి పూజతో యాగాన్ని మొదలుపెడతారు. వీరంతా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. పుణ్యాహవాచనం, యాగశాల సంస్కారం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించనున్నారు. రేపు నవ చండీ హోమం, రాజశ్యామల హోమం తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. శృంగేరి పీఠం గోపికృష్ణ శర్మ ఫణి శశాంక శర్మ ఆధ్వర్యంలో ఈ యాగాలు జరుగుతున్నాయి.


ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు హైకోర్టు విచారణ


ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు హైకోర్టు కీలక విచారణ చేపట్టనుంది. కేసును సిబీఐకి ఇవ్వాలన్న పిటిషన్లపై నేడు విచారించనుంది. 


వరంగల్ - ఎంబీబీఎస్  ప్ర‌వేశాల‌కు మాప్ అప్ నోటిఫికేష‌న్ జారీ  
వరంగల్  కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్  కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 13, 14వ తేదీలలో వెబ్ కౌన్సిలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేరకు  కాళోజీ నారాయ‌ణ‌రావు ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యం నేడు మాప్ అప్ నోటిఫికేషన్‌ను విడుద‌ల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఏంబీబీఎస్ యాజమాన్య  కోటా  సీట్లకు  ఇప్పటికే  రెండు విడతల కౌన్సిలింగ్ పూర్తి అయింది. యాజమాన్యకోటలో  మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్ అప్ రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ నెల 13వ  తేదీన  మధ్యాహ్నం 2 గంట‌ల  నుంచి 14వ తేదీ మధ్యాహ్నం   2 గంట‌ల  వ‌ర‌కు వెబ్ ఆఫ్ష‌న్లును నమోదు చేసుకోవాలి.  అర్హత, నిబంధనలు  ఇత‌ర  వివ‌రాల‌కు www.knruhs.telangana.gov .in వెబ్ సైట్లో సంప్ర‌దించాల‌ని యూనివ‌ర్శిటీ వ‌ర్గాలు సూచించాయి.


నేటి నుంచి జెఎన్టియుహెచ్ లో అంతర్జాతీయ సదస్సు. 


జేఎన్టీయూహెచ్ లో కెమిస్ట్రీ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు నుంచి ఎల్లుండి వరకు అంతర్జాతీయ సదస్సు జరగనుంది. యూనివర్సిటీలోని సిల్వర్ జూబ్లీ సెమినార్ హాల్లో జరిగే సదస్సును యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ కట్టా నర్సింహారెడ్డి, ఇండియన్ ఇనిస్టిట్యూట్ కెమికల్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి హాజరవుతారు. ఇండియాతో పాటు మలేషియా పోలాండ్ ఫ్రాన్స్ తో పాటు తిరదేశాల నుంచి 100 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రసాయన శాస్త్రం కెమికల్ ఇంజనీరింగ్ విభాగాలలో జరుగుతున్న పరిశోధనలపై చర్చలు జరగనున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు పరిశోధన పత్రాలను ప్రదర్శించనున్నారు.


నేడు సుచిత్ర జంక్షన్ సుచిత్ర అకాడమీలో ఉదయం 11 గంటలకు జరిగే క్విట్ ఇండియా వేడుకలు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ప్రముఖక్రీడాకారిణి పీవీ సింధు.


తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు మాసాబ్ ట్యాంక్ లోని బీసీ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నారు.