మాండౌస్‌ తుపాను లక్షద్వీప్, కేరళకు ఆనుకొని ఉన్న ప్రాంతంలో కేంద్రీకృతమైంది. అయితే పుల్ ఎఫెక్ట్ అంటే బంగాళాఖాతంలో ఏర్పడిన తేమని మాండౌస్‌ తనవైపు లాక్కునే ప్రక్రియ కొనసాగుతోంది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో తెలంగాణలోని దక్షిణ ప్రాంతాల్లో వర్షాలు జోరుగా పడనున్నాయి. 


పుల్‌ ఎఫెక్ట్ కారణంగా మచిలీపట్నం, ఒంగోలుకు ఉత్తరం, దక్షిణ తెలంగాణలో, కోనసీమలో, రాయలసీమలో భారీ నుంచి మోస్తారు వర్షలు పడతాయి. మంగళవారం సాయంత్రానికి అల్పపీడన ప్రాంతం కాస్త ముందుకు కదిలి అరేబియా సముద్రంలోకి వెళ్లి కేంద్రీకృతం అవుతుంది. ఫలితంగా కోస్తా ఆంధ్రాలో వర్షాలు తగ్గి సీమలో ఎక్కువ పడనున్నాయి. 


అండమాన్‌లో ఐదు రోజుల్లో సుమారు వారాంతానికి మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ దిశగా కదులుతున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో మాండౌస్‌ కూడా బలపడి అల్పపీడనంగా మారనుంది. ఈ రెండింటి కారణంగా మరోసారి రాష్ట్రంలో వర్షాల ప్రభావం ఉండబోతోంది. 






అమెరికా శాటిలైట్ ప్రకారం వారంతంలో ఏర్పడే అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక మీదుగా వెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మాండౌస్‌ పుల్‌ ఎఫెక్ట్ కారణంగా వర్షాలు పడే ప్రాంతాలు- ఒంగోలు, నెల్లూరులో భారీ వర్షాలు పడతాయి. అనంతపురం, సత్యసాయి, కడప, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కరుస్తాయి. 


తెలంగాణలో వాతావరణం
మాండౌస్‌ పుల్ ఎఫెక్ట్‌ తెలంగాణపై కూడా ఉంటుంది. ఆదిలాబాద్‌లో అక్కడక్కడ వర్షాలు పడతాయి. దక్షిణ తెలంగాణలో జోరుగా వర్షాలు పడే ఛాన్స్ ఉంది. హైదరాబాద్‌లో అక్కడక్కడ తుంపర్లు పడే అవకాశం ఉంది.