తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ల జాబితాలో ఎ.కోదండ రామిరెడ్డి ముందు వరుసలో ఉంటారు. మెగాస్టార్ చిరంజీవితో ఆయనది మంచి హిట్ కాంబినేషన్. చిరంజీవిని స్టార్ హీరో చేసిన ‘ఖైదీ’ దగ్గర నుంచి ‘ఛాలెంజ్’, ‘అభిలాష’, ‘పసివాడి ప్రాణం’, ‘విజేత’, ‘దొంగ మొగుడు’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు కోదండ రామిరెడ్డి డైరెక్షన్‌లోనే వచ్చాయి. కానీ ఆయన వారసులు మాత్రం తమిళ చిత్ర పరిశ్రమలోనే సెటిలయ్యారు. చిన్న కొడుకు వైభవ్ ‘కాస్కో’, ‘గొడవ’ లాంటి సినిమాలతో టాలీవుడ్‌లోనే మొదట ఎంట్రీ ఇచ్చారు. కానీ మెల్లగా తమిళానికి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు తమిళంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయిపోయారు. వైభవ్ గురించి మనకు కాస్తో కూస్తో తెలిసే ఉంటుంది. కానీ పెద్ద కుమారుడు సునీల్ మాత్రం సైలెంట్‌గా కోలీవుడ్‌లో జెండా పాతేశారు.


సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్‌బస్టర్ ‘జైలర్’ సినిమాలో తమన్నా బాయ్‌ఫ్రెండ్ బాగున్నారా బాలు పాత్రలో నటించింది ఆయనే. దీనికి ముందు ఇదే ‘జైలర్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ‘డాక్టర్’, ‘బీస్ట్’ సినిమాల్లో కూడా నటించారు. ముఖ్యంగా ‘డాక్టర్’ సినిమాలో ఆయన పోషించిన మహాలి పాత్ర... తన కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది.


పార్టీలో కలిస్తే విలన్ ఛాన్స్
2018లో విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘సీతాకత్తి’ సినిమాలో విలన్‌గా సునీల్ మొదట సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చారు. ఒక పార్టీలో సునీల్‌ను ‘సీతాకత్తి’ దర్శకుడు బాలాజీ తారానీత్రన్ కలిశారు. తన సినిమాలో విలన్ పాత్రకు సునీల్ అయితే బాగుంటుందని భావించి ఆయనకు సంప్రదించారు. సునీల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో సునీల్ పోషించిన ధనపాల్ పాత్ర తనకు మంచి పేరు తీసుకువచ్చింది.


సునీల్ కెరీర్‌ను తర్వాతి స్థాయికి తీసుకెళ్లింది మాత్రం నెల్సనే. ‘డాక్టర్’లో సునీల్ పోషించిన మహాలి పాత్ర సెకండాఫ్ అంతా చక్కటి వినోదాన్ని పంచుతుంది. సునీల్‌ను ఆంటీ హీరో అంటూ యోగి బాబు చేసే కామెడీ బాగా వర్కవుట్ అయింది. లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మాస్టర్’లో కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ పాత్రలో సునీల్ కనిపించారు.


‘అన్నాబెల్లే సేతుపతి’, ‘బీస్ట్’, ‘సొప్పన సుందరి’ సినిమాల్లో కూడా సునీల్ నటించారు. కానీ ఈ సంవత్సరం వచ్చిన ‘మామన్నన్ (తెలుగులో నాయకుడు)’, ‘జైలర్’ సినిమాలు సునీల్ కెరీర్ గ్రాఫ్‌ను మార్చేశాయి. సునీల్ ఇప్పటి దాకా చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా మంచి నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను మారి సెల్వరాజ్ డిజైన్ చేశారు. ఒక రకంగా కథను మలుపు తిప్పే కీలక పాత్ర ఇదే. ఇక ‘జైలర్’లో కూడా సునీల్ పోషించిన బాగున్నారా బాలు పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది. తమన్నాకు జోడీగా ఆయన ఈ సినిమాలో నటించారు. సునీల్ ఇప్పటివరకు స్ట్రయిట్ తెలుగు సినిమా చేయలేదు. సరైన టాలెంట్ ఉంటే పక్కభాషల నటులను కూడా నెత్తిన పెట్టుకునే ఇండస్ట్రీ మనది. కాబట్టి త్వరలో తెలుగు సినిమాల్లో కూడా సునీల్‌ను చూసే అవకాశం ఉంది.


Read Also : Dhanush: శోభన, తిరుల స్నేహానికి ఏడాది - ధనుష్, నిత్యా మీనన్ ఆసక్తికర పోస్ట్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial