ట్రాన్స్ జెండర్ల వేషంలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న 19 మంది నకిలీ ట్రాన్స్ జెండర్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు నార్త్ జోన్ పోలీసులు. వారి నుంచి తొమ్మిది సెల్ ఫోన్లు, రూ.12 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి తెలిపారు. నార్త్ జోన్ పరిధిలోని మహంకాళి పోలీస్ స్టేషన్ రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ మారేడ్ పల్లి పోలీస్ స్టేషన్, గోపాలపురం పోలీస్ స్టేషన్ల లిమిట్స్ లో ఉన్న జనాలు ఎక్కువగా తిరిగే ప్యారడైజ్ చౌరస్తా, శ్రీకర్ ఉపకార చౌరస్తా, జూబ్లీ బస్ స్టాండ్, సంగీత్ చౌరస్తాలలో ప్రయాణికులు, వాహనదారులు, దుకాణదారుల నుండి ట్రాన్స్ జెండర్లు బలవంతంగా డబ్బులు వసూల్ చేస్తున్నారు. అంతేకాక, డబ్బు ఇవ్వని వారిని తిట్టడం, బెదిరించడం, అవమానించడం లాంటి అసాంఘిక చేష్టలకు పాల్పడుతున్నారని పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
వారి ఫిర్యాదు మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి రంగంలోకి 19 మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేయగా, వారు ట్రాన్స్ జెండర్స్ కాదని తేలిందని డీసీపీ తెలిపారు. ఆడవారి వేషధారణలో ఉన్న పురుషులని తెలిపారు. సులభంగా డబ్బులు సంపాదించడం కోసం ఈ కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, రాత్రి వేళల్లో అసాంఘిక కార్యలాపాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ఇలా బెదిరింపులు, వేధింపులకు పాల్పడి డబ్బుల వసూళ్లకు పాల్పడితే నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు డీసీపీ సూచించారు.
డీసీపీ చందన దీప్తి మాట్లాడుతూ.. ‘‘నార్త్ జోన్ పరిధిలో మహంకాళి, మారేడ్ పల్లి, రాంగోపాల్ పేట్, గోపాలపురం పీఎస్ పరిధిలో కేసులను నమోదు చేశాం. రోడ్లపై బెగ్గింగ్ పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడుతున్న 19 మందిని గుర్తించి వారిని అరెస్టు చేశాం. మగవారు ట్రాన్స్ జెండర్స్ గా మారువేషంలో సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. బెగ్గింగ్ మాటున వేధింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే వాహనదారుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారు.
19 మందిలో ఇద్దరు మాత్రమే ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. రాజేష్ యాదవ్, అనిత ఈ ముఠా గ్యాంగ్ లీడర్. ఎలా డబ్బులు వసూలు చేయాలో ట్రైనింగ్ ఇస్తారు. ఇలాంటి వాళ్ళ వల్ల హైదరాబాద్ నగరం ప్రతిష్ఠ దెబ్బతీంటోంది. సాయంత్రం తర్వాత వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. బిహార్, ఆంధ్ర, తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ తీసుకువచ్చి ఈ దందా చేస్తున్నారు. ఈజీ మనీ కోసం చేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గంజాయి, డ్రగ్స్ ఏమైనా సరఫరా సైతం చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం.
నకిలీ ట్రాన్స్ జెండర్స్ వల్ల నిజమైన ట్రాన్స్ జెండర్స్ ఇబ్బందులు పడుతున్నారు. బెగ్గింగ్ మాఫియాపై ప్రత్యేక నిఘా పటిష్ఠంగా ఉంటుంది. బెగ్గింగ్ మాఫియాపై డ్రైవ్ నిరంతరం చేస్తాం. ఈ గ్యాంగ్ కి లీడర్స్ వాళ్లకి షెల్టర్లు ఇస్తారు. సంగీత్ చౌరస్తా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వీళ్లకి మెయిన్ షెల్టర్. ఈజీ మని కోసమే మహిళలు, ట్రాన్స్ జెండర్స్ అవతారం ఎత్తుతున్నారు’’ అని పోలీసులు వెల్లడించారు.