తెలుగులో స్టాండప్ కామెడీలు అనేవి అసలు ఫేమస్ కానీ రోజుల్లో వచ్చింది ‘జబర్దస్త్’. పది సంవత్సరాల క్రితం ఇలాంటి షో ఒకటి బుల్లితెరపై రావడం ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. కొన్ని ఎపిసోడ్స్‌లోనే చాలామంది ప్రేక్షకులను ఆకర్షించింది. దాదాపు అయిదు సంవత్సరాల వరకు తిరుగులేని టీఆర్‌పీని సాధించింది. ఇలాంటి ఎన్నో స్టాండప్ కామెడీ షోలు వచ్చి వెళ్లిపోయినా.. ‘జబర్దస్త్’ మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. అంతే కాకుండా ఎంతోమంది అప్‌కమింగ్ ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చింది. అలాంటి వారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్ర.. జబర్దస్త్‌కు రాకముందు తన జీవితం గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.


ఫ్యామిలీ స్కిట్స్‌తో ఫేమస్..
ఇప్పుడంటే ‘జబర్దస్త్’లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువైపోయాయి. కానీ మొదట్లో అలా ఉండేది కాదు. ఫ్యామిలీ షోలాగా పర్ఫెక్ట్ ఉండేది. అలాంటి సమయంలో చమ్మక చంద్ర చేసే స్కిట్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. మహిళలపై కామెడీలు చేస్తూ స్కిట్ చేసి ఎపిసోడ్ విన్నర్ అయ్యేవాడు చంద్ర. ఆ కామెడీ కూడా మరీ శృతిమించకుండా ఉండేది కాబట్టి బుల్లితెరను ఫాలో అయ్యే చాలామంది మహిళలకు చంద్ర దగ్గరయ్యాడు. కానీ జబర్దస్త్‌కు రాకముందు మాత్రం చంద్ర ఎవరు అనేది కూడా ప్రేక్షకులకు తెలియదు. అంతే కాకుండా అసలు ఏమీ లేని కుటుంబం నుంచి ఈ స్థాయికి వరకు వచ్చానని.. చంద్ర చాలాసార్లు తన గతం గురించి చెప్పుకున్నాడు. ఇటీవల మరోసారి తన ఇష్టాల గురించి, కష్టాల గురించి బయటపెట్టాడు.


రెండేళ్ల పాటు ఇన్‌స్టిట్యూట్‌లో పాట్లు..
చిన్నప్పటి నుంచి తనకు కామెడీ సినిమాలంటేనే ఇష్టమని చంద్ర చెప్పుకొచ్చాడు. సినిమా పోస్టర్ మీద కామెడియన్ ఫోటో ఉంటే చాలు.. ఆ సినిమాకు వెళ్లిపోయేవాడినని అన్నాడు. సినిమాల్లో కామెడీతో పాటు చిరంజీవి, ఆయన సినిమాలు, డ్యాన్సులు అంటే తనకు చాలా ఇష్టమని చంద్ర తెలిపాడు. పెళ్లిళ్లలో చిరంజీవి పాటలు పెట్టుకొని, స్టెప్పులు వేసేవాడిని అంటూ గుర్తుచేసుకున్నాడు. అందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో హైదరాబాద్ వచ్చేశానని అన్నాడు. ఆ తర్వాత రెండేళ్ల పాటు ఇన్‌స్టిట్యూట్ యాక్టింగ్, డ్యాన్స్ నేర్చుకున్నానని, దాని వల్ల అప్పటికే తన ఆర్థిక స్థోమత చాలా కఠినంగా మారిందని తెలిపాడు. ఇంటి నుంచి ఆర్థికంగా సాయం అందుకునే పరిస్థితి తనకు లేదని, తనకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారని బాధపడ్డాడు.


ఏం జరిగినా భరించాలని అనుకున్నా..
చంద్ర చిన్నప్పుడు తన తండ్రి పాటు, కట్టెలు అమ్ముకొని ఇంట్లోకి బియ్యం కొనుక్కొని వచ్చేవాడని గుర్తుచేసుకున్నాడు. ఏదో ఒక పని చేసుకుందామనే ఉద్దేశ్యంతో ఇండస్ట్రీకి వచ్చినా.. ఇక్కడ తను చాలా కష్టాలు పడ్డానని తెలిపాడు. ఇంట్లో డబ్బులు అడగకుండా ఉద్యోగం చేసి ఆ డబ్బులతోనే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యానని అన్నాడు. అక్కడే ధనరాజ్‌ను కలిశానన్నాడు. తను చేరిన ఇన్‌స్టిట్యూట్‌లో ధనరాజ్.. మాస్టర్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడని, మొదటిగా ఇండస్ట్రీలో తనకు స్నేహితుడు అయ్యింది ధనరాజే అని గుర్తుచేసుకున్నాడు. చాలావరకు తను ఒంటరిగానే కష్టపడి ఎదిగానని, చిన్న చిన్న పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకున్నాని అన్నాడు. ఏం జరిగినా భరించాలని నిర్ణయించుకున్నాని, అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో ఉండగలిగానని చమ్మక చంద్ర తను హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత జరిగిన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.


Also Read: ‘బ్రో’ వచ్చేస్తున్నాడు - ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial